గోకులం ముసుగులో.. భూముల కబ్జా | - | Sakshi
Sakshi News home page

గోకులం ముసుగులో.. భూముల కబ్జా

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 7:05 AM

గోకుల

గోకులం ముసుగులో.. భూముల కబ్జా

మధుపాడలో కొనసాగుతున్న

కొత్తతరహా దందా

గ్రామకంఠంలో పశుషెడ్ల నిర్మాణం

విస్తుపోతున్న గ్రామస్తులు

గంట్యాడ: అధికార బలం ఉంది.. ఆపై ప్రభుత్వ స్కీమ్‌ ఉంది.. చేతికి మట్టి అంటకుండా.. ఇంటిలోని డబ్బులు పెట్టుబడి పెట్టకుండా గోకులం నిర్మాణాల పేరుతో గ్రామకంఠాలను గుట్టుచప్పుడుగా కబ్జా చేసేస్తున్నారు. పశువుల షెడ్ల పేరుతో ప్రభుత్వ భూములను సొంతం చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణల పర్వానికి గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామం వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే... గోకులం షెడ్ల పథకం కింద గ్రామానికి 12 షెడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఆరు షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండు పశువుల ఉన్న షెడ్‌కు రూ.1.15 లక్షలు, నాలుగు పశువుల యూనిట్‌ షెడ్‌కు రూ.1.85 లక్షలు, ఆరు పశువుల యూనిట్‌ షెడ్‌ నిర్మాణానికి రూ.2.30 లక్షలను ప్రభుత్వం మంజూరు చేస్తోంది. వీటిలో 10 శాతం రైతు వాటాకాగా, మిగిలిన 90 శాతం నిధులు ప్రభుత్వం రాయితీకింద ఇస్తుంది. ఇదే అదునుగా గ్రామానికి చెందిన కొందరు గోకులం షెడ్లను వివాదాస్పద, ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్నారు. వాస్తవంగా రైతుల సొంత జిరాయితీ భూముల్లోనే షెడ్లు నిర్మించాలి. కానీ, ఇక్కడ మాత్రం డీ పట్టాభూములు, గ్రామకంఠాలు స్వాధీనం చేసుకునే క్రమంలో పశుషెడ్లు ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పశుషెడ్లు సాక్షిగా గ్రామకంఠం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఇది చూసిన గ్రామస్తులు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వ సొమ్ముతో... ప్రభుత్వ భూముల ఆక్రమణల పర్వం చూసి అవాక్కవుతున్నారు. తాటిపూడి రిజర్వాయర్‌ కింద ఉన్న కాలువ భూముల్లోనూ పశుషెడ్లు నిర్మాణాలు తలపెట్టారని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరికి ఆవులు లేకపోయినా యూనిట్లు మంజూరయ్యాయని, వారు ఆ సొమ్ముతో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విష యం అధికారులకు తెలిసినా మిన్నకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెబుతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

పశుషెడ్ల నిర్మాణంలో ఆక్రమణలు, అక్రమాల ఆరోపణలు తనదృష్టికి రాలేదు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ అయితే వెంటనే స్థల పరిశీలన చేపట్టి సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటాం.

– బి.రమణమూర్తి, ఎంపీడీఓ, గంట్యాడ

గోకులం ముసుగులో.. భూముల కబ్జా 1
1/2

గోకులం ముసుగులో.. భూముల కబ్జా

గోకులం ముసుగులో.. భూముల కబ్జా 2
2/2

గోకులం ముసుగులో.. భూముల కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement