లిక్విడ్ గంజాయి స్వాధీనం
● ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో...
● రూ. 210 కోట్ల విలువైన సొత్తు సీజ్
● నలుగురు అరెస్ట్
పార్వతీపురం రూరల్ : కొరాపుట్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన వేర్వేరు దాడుల్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఒడిశా–ఆంధ్రా సరిహద్దులోని జోలాపుట్ రిజర్వాయర్ పరిసర అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) తయారీ కేంద్రాన్ని పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 1800 లీటర్ల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు రూ.5 కోట్ల విలువైన వెయ్యి కిలోల ఎండు గంజాయిని, తయారీకి ఉపయోగించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్భేద్యమైన అటవీ ప్రాంతం కావడంతో నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు తరచూ స్థావరాలను మారుస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసు బృందాలు రహస్యంగా పడవల్లో ప్రయాణించి, అనంతరం కాలినడకన వెళ్లి ఈ తయారీ యూనిట్‌పై దాడి చేశాయి. ఈ దందాకు సంబంధించి అంతరాష్ట్ర ముఠాల ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కీలక సూత్రధారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో ఘటనలో 1143 కిలోల గంజాయి సీజ్ జిల్లాలోని నంద్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మరో దాడిలో పోలీసులు 1143 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రెండు పికప్ వాహనాల్లో ప్లాస్టిక్ ట్రేల కింద రహస్యంగా తరలిస్తుండగా వీటిని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కేసులో హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు రిసీవర్లు, సెమిలిగూడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సరఫరాదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


