కుస్తీ క్రీడాకారిణిపై విధి కన్నెర్ర
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హేమలత
ఒక కాలు పోగొట్టుకున్నవైనం
కన్నీరుపెడుతున్న క్రీడాకారిణి
గంట్యాడ: ఆమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. గ్రామీణ క్రీడ అయిన కుస్తీ (రెజ్లింగ్) పోటీలపై మక్కువ పెంచుకుంది. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కఠోర సాధన చేసింది. జాతీయ స్థాయి పోటీల్లో తలపబడి ప్రతిభ చూపింది. పతకాలతో మెరిసింది. రక్షణ దళాల్లో చేరి దేశసేవలో తరించాలని తలచింది. ఆమె ఆశలపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆశలన్నీ అడియాసలుగా మిగిల్చింది. ఈ నెల 6వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన కుస్తీ క్రీడాకారిణి వర్రి హేమలత కాలిని తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు తొలగించడంతో కన్నీరుపెడుతోంది. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చూస్తోంది.
ఆటలో దిట్ట..
హేమలత బరిలో దిగిందంటే ప్రత్యర్థిలో వణుకుపుట్టాల్సిందే. రెండేళ్లపాటు నిరంతర సాధనతో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. అదే దూకుడుతో జాతీయ స్థాయిలో ఎనిమిది టోర్నమెంట్లలో పాల్గొని మెరుగైన ప్రదర్మనతో గుర్తింపు పొందింది. సైనికురాలిగా దేశానికి సేవ చేయాలన్న సంకల్పం ఆమె అడుగులకు బలం ఇచ్చింది. అవకాశాలు త్రుటిలో చేజారినా నిరాశకు లొంగకుండా ముందుకు సాగింది. ఈ నెల 6న ఉద్యోగ దరఖాస్తు కోసం నగరానికి వెళ్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. క్షణాల్లోనే కుడి కాలిపై వాహన చక్రం దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన హేమలత ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు కుడి కాలును పూర్తిగా తొలగించారు. మరిన్ని శస్త్రచికిత్సలు అవసరమని తెలిపారు. కాలు కోల్పోయినా ఆమె మనసు మాత్రం కూలలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మధ్య జీవితం వైపు మళ్లీ నిలబడాలని తపిస్తోంది.
సర్కారు ఆదుకుంటే..ఆశలకు రెక్కలు..
ప్రతిభావంతురాలైన ఈ యువ క్రీడాకారిణికి ప్రభుత్వం సహాయం అందించాలని గ్రామస్తులు కుటుంబీకులు వేడుకుంటున్నారు. ప్రమాదం అడుగులను ఆపేసినా... సంకల్పాన్ని కాదు. జీవిత పోరాటంలో హేమలత మళ్లీ గెలుస్తుందనే ఆశతో అందరూ ఎదురు చూస్తున్నారు.


