ఐసీడీఎస్ పీడీగా బాలామణి బాధ్యతల స్వీకరణ
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ విజయనగరం ప్రాజెక్టు డైరెక్టర్‌గా కొత్తకోట వెంకట బాలామణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. పీడీగా బాధ్యతలు స్వీకరించిన బాలామణికి సీడీపీఓలు, కార్యాలయం ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఇక్కడ పీడీగా పనిచేసిన విమలారాణి మెడికల్ లీవు పెట్టడంతో ఆ శాఖ ఉన్నతాధికారులు బాలామణిని నియమించారు. ఈమె కర్నూలు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓగా పనిచేసి ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. లబ్ధిదారులకు శతశాతం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
665 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షానికి 665 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బాడంగిలో 10 ఎకరాల్లోను, బొండపల్లి మండంలో 25, దత్తిరాజేరులో 200, గజపతినగరంలో 230, నెల్లిమర్లలో 70, రామభద్రపురంలో 130 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్టు గుర్తించారు.
పాలకేంద్రం ఆకస్మిక తనిఖీ
పూసపాటిరేగ: భోగాపురం మండల కేంద్రంలోని పాలకేంద్రాన్ని జిల్లా ఆహారభధ్రతా అధికారి ఎస్.కె.నాగుల్‌మీరా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాల కేంద్రంలో శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్‌కు పంపిస్తామని, నివేదికలో కల్తీ జరిగినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పాలను కల్తీ చేయకుండా కేంద్రాలకు పాలు సరఫరా చేయాలని రైతులకు సూచించారు.
సీతంపేట: గిరిజనుల నుంచి సేకరించిన కొండచీపుర్లు, కుంకుడికాయలు, నల్లజీడి, పసుపుకొమ్ముల విక్రయానికి వచ్చేనెల 4న సీతంపేట ఐటీడీఏలో అడ్వాన్స్ టెండర్లు నిర్వహిస్తామని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవార్ స్వప్నిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్:88972 23650ను సంప్రదించాలని కోరారు.
ఐసీడీఎస్ పీడీగా బాలామణి బాధ్యతల స్వీకరణ


