122 పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదన
● డీఆర్వో మురళి
విజయనగరం కలెక్టరేట్:
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి తెలిపారు. తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ తొందరగా పూర్తిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలన్నీ బీఎల్‌ఏలను నియమించుకోవాలన్నారు. ఓటర్ల సవరణల జాబితాల ప్రకారం ఫిబ్రవరి 26 నాటికి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారని , ఇందులో రెండుచోట్ల ఓట్లు కలిగిన వారు 2,975 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. విచారణ అనంతరం వీరి ఓట్లను ఒకచోట ఉంచి మరో చోట తొలగిస్తామని చెప్పారు. జిల్లాలో 1847 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని, వాటికి ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు వి.నర్సింహమూర్తి, ఎ.శ్రీనివాసరెడ్డి, సీహెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.


