పాలల్లో నాణ్యత ఎంత..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనాధారంలో గాలి, నీరు మాదిరి పాలు కూడా తప్పనిసరి. ప్రతీ రోజు ఆహారంలో భోజనంతో పాటు పాలు తాగడం కూడా అలవాటు చేసుకున్నారు. పసి పిల్లలు దగ్గర నుంచి పెద్దవారు వరకు అందరికి పాలు అవసరం పెరిగింది. సమాజంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. అయితే రాజమండ్రిలో జరిగిన ఘటనతో జనంలో వణుకు మొదలైంది. కల్తీపాలు తాగడం కారణంగా ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడగా, మరికొంతమంది ప్రాణాప్రాయ స్థితిలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు తాగుతున్న పాలల్లో నాణ్యత ఎంత దానిపై సర్వత్రా సందేహాం నెలకొంది. పాలు, పాల ఉత్పత్తులు నాణ్యమైనవేనా, నాణ్యత లేనివా.. అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం పరుస్తున్నారు.
పాల వినియోగం ఎక్కువే..
ప్రతీ ఇంటిలోనూ నిత్యం పాలు, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాలు వినియోగించని ఇల్లు ఏది ఉండదు. ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగడానికి పాలు వినియోగిస్తారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, ఇలా ప్రతీ ఒక్కరూ పాలు తాగుతారు. అదే విధంగా వివిధ డెయిరీలు పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నారు. కోవా, బ్రెడ్, మజ్జిగ, నెయ్యి, పన్నీరు, బిస్కెట్స్, లస్సీ వంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. వీటిలో పాల ప్యాకెట్లు కూడా 200 మి.లీ నుంచి, అరలీటరు, లీటరు పాల ప్యాకెట్లు వివిధ డెయిరీ కంపెనీలు ఔట్‌లెట్స్ పెట్టి విక్రయిస్తున్నారు.
అనుమతులు లేకుండానే విక్రయాలు
పట్టణ ప్రాంతాల్లో ప్రజలు డెయిరీ పాల ప్యాకెట్లు కంటే వ్యాపారులు బైక్‌లపై తెచ్చి విక్రయించే పాలును ఎక్కువగా కొనుగోలు చేస్తారు. పాడి రైతులు దగ్గర నుంచి కొనుగోలు చేసి తెస్తారని వీరి దగ్గర ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే ఇలా పాలు విక్రయించేవారు ఎటువంటి అనుమతులు లేకుండా విక్రయించడం గమనార్హం.
పాలు, పాల ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ
రాజమండ్రి ఘటన చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. ప్రజలు ఆహారంలో ప్రధానమైన పాలు తాగడం వల్ల మనుషులు చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పడు ఎక్కడ చూసినా పాలు, పాల ఉత్పత్తులపై చర్చ జరుగుతుంది. వివిధ డెయిరీలు, పాలు, ఉత్పత్తులపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు సురక్షితమైనవేనా, లేదా పాలు చిక్కగా, రుచిగా కనిపించడానికి యూరియా, ఇతర రసాయనాలు ఏమైనా కలుపుతున్నారా.. అనే తనిఖీలు చేపట్టిన దాఖలా లు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలు తా గడం సురక్షితమేనా.., లేదంటే ప్రాణపాయామా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నులు
పాల ఉత్పత్తి
జిల్లాలో 4,75,805 పాడి పశువులు ఉన్నాయి. వీటిలో ఆవులు 3,77,960, గేదెలు 97,845 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి 8,36,800 మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో వివిధ పాల డెయిరీలు, వ్యాపారులు ద్వారా ఏడాదికి 3,65,000 మెట్రిక్ టన్నులు పాల సేకరణ జరుగుతుంది. జిల్లాలో సుమారుగా 19 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక వ్యక్తికి 570 ఎం.ఎల్ పాలు రోజుకి అవసరం పడుతుంది.
రాజమండ్రి ఘటనతో జిల్లా ప్రజల్లో టెన్షన్
జిల్లాలో ఏడాదికి 8.36 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి
డెయిరీలు, పాల వ్యాపారులు సేకరిస్తున్నది 3.65 లక్షల మెట్రిక్ టన్నులు
డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, ఉత్పత్తులపై కొరవడిన పర్యవేక్షణ
ఎటువంటి అనుమతులు లేకుండా పాలు విక్రయించేస్తున్న వ్యాపారులు
నాణ్యత తనిఖీ చేయాలి..
వివిధ డెయిరీలు, పాల వ్యాపారులు విక్రయించే పాలు, వాటి ఉత్పత్తుల నాణ్యతను ఆహార తనిఖీ అధికారులు చేపట్టాలి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సి ఉంది.
– డాక్టర్ మురళీకృష్ణ, జేడీ, పశు సంవర్ధక శాఖ
శాంపిల్స్ తీశాం..
జిల్లాలో వివిధ డెయిరీలు విక్రయించే పాల ప్యాకెట్ల నుంచి శాంపిల్స్ తీశాం. వాటిలో నాణ్యత లోపించినట్టు కనిపించలేదు.
– ఈశ్వరి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్,
విజయనగరం
పాలల్లో నాణ్యత ఎంత..!


