కాపు సామాజికవర్గంపై కుట్ర
● వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు ‘వలిరెడ్డి’
చీపురుపల్లి: రాష్ట్రంలో కాపు సామాజికవర్గాన్ని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ అణగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న విపక్ష నేత బొత్స సత్యనారాయణకు సమాధానం చెప్పలేని టీడీపీ ప్రభుత్వం.. పొట్టకూటి కోసం టీవీల్లో స్కిట్లు వేసుకునే కమేడియన్లతో చిల్లర రాజకీయాలు సాగిస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు బొత్స సత్యనారాయణ లాంటి నేతతో మాట్లాడే అర్హత స్కిట్లు వేసుకునే కమేడియన్లకు లేదని స్పష్టం చేశారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయించిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా కాపు సామాజికవర్గానికి ఆదర్శమైన బొత్స సత్యనారాయణను కించపరిచే విధంగా హేళన చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం దారుణమన్నారు. ఓ వైపు కాపులను దిగజార్చే విధంగా చంద్రబాబు, లోకేష్‌లు పన్నాగం పన్నుతున్నప్పటికీ.. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోకుండా చూస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులకు తగిన సమయంలో కాపులు బుద్ధి చెబుతారన్నారు.


