జిల్లాకు తీరని ద్రోహం
పార్వతీపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లాకు మరోసారి తీవ్రమైన ద్రోహం చేసిందని ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు ఎం. కృష్ణమూర్తి, బంటు దాసు ఆరోపించారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో వారు మాట్లాడుతూ.. ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో గల నీటి ప్రాజెక్ట్‌లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. కేవలం రూ. 10 కోట్ల నిధుల కేటాయింపుతో పూర్తయ్యే అడారు గెడ్డ, వనకాబడి గెడ్డ వంటి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సైతం పూర్తిగా విస్మరించారన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌కు రూ.200 కోట్లు నిధులు కేటాయించాలని అధికారులు కోరినప్పటికీ రూ. 47 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్‌లో సమగ్ర నీటి అభివృద్ధికి జిల్లాకు రూ. 10 వేల కోట్లు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయమని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.


