వినతుల వెల్లువ
విజయనగరం కలెక్టరేట్: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజేఎస్‌ఆర్) వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది వచ్చి తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి 259 వినతులు రావడం విశేషం. వీటిలో 166 వినతులు పీజేఆర్‌ఎస్‌కు రాగా.. రెవెన్యూ క్లినిక్‌కు 93 వినతులువచ్చాయి. డీఆర్వో ఈ. మురళి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, కళావతి, నూకరాజు, బి.శాంతి వినతులు స్వీకరించారు. అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పీజీఆర్‌ఎస్‌కు 73 వినతులు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్‌ఎస్) వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 73 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 25 అర్జీలు రాగా.. మిగిలిన సమస్యలపై 48 వచ్చాయి. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో ఇచ్చిన వినతుల్లో కొన్ని..
● తల్లికి వందనం నగదు వేరొక వ్యక్తి ఖాతాలో జమ అయ్యిందని, తనకు రావల్సిన నగదును కాలేజీ వారి ద్వారా తన ఖాతాలో జమయ్యేలా చూడాలని కోరుతూ కురుపాం కేటీఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల నుంచి మీసాల జ్యోతి అర్జీ అందించారు.
● కుటుంబ పెద్ద మృతి చెందారని, ప్రస్తుతం సికిల్‌సెల్ ఎనిమియాతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తనకు సికిల్‌సెల్ ఎనిమియా పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన నత్తల అస్విత్ కోరారు.
● తన బిడ్డలకు బాలికా సంరక్షణ పథకం కింద బాండ్లను జారీ చేశారని, వాటి కాలపరిమితి పూర్తయి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు నగదు ఇవ్వడం లేదని పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామానికి చెందిన ఎస్.సోములు అధికారులను వేడుకున్నాడు.
● తన భర్తకు 20 ఏళ్ల కిందట ప్రభుత్వం 2.50 ఎకరాల పొలాన్ని (డీ పట్టా) ప్రభుత్వం మంజూరు చేయగా.. కొంతమంది ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మండంగి సుశీల వినతిపత్రం అందజేసింది.
వినతుల వెల్లువ


