పెద్దగెడ్డ పనులకు కేంద్రం మొగ్గు
● రూ.78.22 కోట్ల ఎంసీఏడీ నిధులు మంజూరు
● పరిపాలనా అనుమతులు వస్తే పనులకు శ్రీకారం
పెద్దగెడ్డ ప్రాజెక్టు
బొబ్బిలి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి జలయజ్ఞఫలం పెద్దగెడ్డ ప్రాజెక్టు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ప్రాజెక్టు నుంచి అదనపు ఆయకట్టుకు సాగునీరందించే పనులకు ఎంసీఏడీడబ్ల్యూఎం(మోడిఫికేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలెప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్)పథకం కింద నిధులు విడుదల చేసింది. పరిపాలనా అనుమతులు వస్తే పనులు ప్రారంభంకానున్నాయి. ఈ ప్రాజెక్టును వైఎస్సార్ నిర్మించి జాతికి అంకిత మిచ్చారు. కుడి ప్రధాన కాలువ నుంచి 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఆ తరువాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జైకా నిధులు రూ.28.18 కోట్లు మంజూరు చేయించారు. పనులు ప్రారంభించారు. పది శాతం పనులు జరిగాక ప్రభుత్వం మారడంతో జైకా పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది
పెద్దగెడ్డకు కొత్త పథకంలో అభివృద్ధి చేసేందుకు కేంద్రప్ర భుత్వం గుర్తించింది. ఎంసీఏడీ పధకం ద్వారా రూ.78.22 కోట్లు మంజూరయ్యా యి. వీటికి పరిపాలనా అనుమతులు రావాల్సి ఉంది. జంఝావతి పంప్ హౌస్ సిస్టం మరమ్మతుల కోసం రూ.56.50కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.
– ఆర్.అప్పారావు,
ఎస్‌ఈ, ఇరిగేషన్ సర్కిల్, బొబ్బిలి
కేంద్రం గుర్తింపు...
జంఝావతి అభివృద్ధికి ప్రతిపాదనలు
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటిగా ఏర్పాటుచేసిన రబ్బర్ డ్యాంతో కూడిన జంఝావతి ప్రాజెక్టు అభివృద్ధికి కొత్తగా రూ.56.50కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. గత ఏడాది, ఈ ఏడాది మరమ్మతులకు గురైనా పనులు చేపట్టలేదు. మొత్తం 23 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టులో భాగమైన కంట్రోల్ రూమ్ పంపింగ్ ప్యానెల్, లైనింగ్, వన్ ఆర్ కెనాల్, లోయల్ కెనాల్ పనుల కోసం వెచ్చించేందుకు ఈ ప్రతిపాదనలను ఇటీవలే పంపించారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంసీఏడీడబ్ల్యూఎం పథకం కింద పెద్దగెడ్డను గుర్తించింది. దీని ప్రకారం ఎడమ కాలువకు పంప్ హౌస్‌ను నిర్మించి వాల్వ్‌ల ద్వారా ఆటోమేటిక్‌గా (నాన్‌మెన్) ఆయకట్టు పొలాలకు సాగునీరందించే పనులు జరగనున్నవి. ప్రెషర్ పైపుల ద్వారా సాగునీటిని ఆయకట్టుకు మళ్లించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇది పూర్తిగా కొత్తవిధానం. వాల్వులు, ప్రెషర్ పైపులతో నీటిని మళ్లించడం వల్ల సాగునీటి లీకులు ఉండవు. సిబ్బంది అవసరం ఉండదు. పూర్తి ఆటోమేటిక్‌గా నడిచే వ్యవస్థ కనుక దీనికి కేంద్రం ప్రాధాన్యతనివ్వడం విశేషం. ఎడమ కాలువ ప్రాంతంలో ఉన్న కర్రివలస ఆనకట్టను అభివృద్ధి చేసి అక్కడి నుంచి కూడా కుడి, ఎడమ కాలువలను నిర్మించి ప్రాజెక్టును పూర్తిగా అభివృద్ధి చేస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను భరించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇరిగేషన్ వ్యవస్థకు రాష్ట్రం పెద్దగా నిధులు విదల్చకపోవడంతో ఈ కొత్త పథకానికై నా 40 శాతం నిధులు భరిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు జైకా నిధులతో జరుగుతున్న పనులు ప్రస్తుతం నిలిపివేసినప్పటికీ కాంట్రాక్టర్ మళ్లీ పనులు చేపడితే కుడి కాలువ పనులు కొనసాగే అవకాశముంది.
పెద్దగెడ్డ పనులకు కేంద్రం మొగ్గు


