ధ్యానదినోత్సవానికి తరలిరండి
● రాజయోగిని అన్నపూర్ణ
విజయనగరం టౌన్: ప్రపంచ ధ్యానదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 20న మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే ధ్యాన దినోత్సవంలో ప్రజలంతా పాల్గొనాలని బ్రహ్మకుమారీస్ సేవాకేంద్రాల జిల్లా ఇన్‌చార్జి, రాజయోగిని బి.కె.అన్నపూర్ణ తెలిపారు. కంటోన్మెంట్ బ్రహ్మకుమారీస్ కేంద్రంలో ధ్యాన దినోత్సవ ఆహ్వాన పత్రికలను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచ శాంతి, ఐక్యత, స్నేహం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరివర్తన లక్ష్యంగా కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. అవకాశం ఉన్నవారందరూ ధ్యానదినోత్సవంలో పాల్గొని మానసిక పరివర్తన పొందాలని కోరారు.
ఆర్ధికాభివృద్ధిరేటులో జిల్లాకు 8వ స్థానం
విజయనగరం అర్బన్: అభివృద్ధిరేటులో విజయనగరం జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రెండురోజుల పాటు రాష్ట్ర రాజధానిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతికి ప్రశంసలు లభించాయి. వివిధ కార్యక్రమాల అమలుపై తరచూ ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్‌ఎస్ సర్వేలో 69.14 శాతం సానుకూలత వ్యక్తం కావడంతో జిల్లాకు మెరుగైన స్థానం దక్కింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 80 శాతం ఆదాయాన్ని ఇచ్చే జిల్లాల్లో విజయనగరానికి చోటు దక్కింది.
ఆ బిల్లు మాకొద్దు
విజయనగరం గంటస్తంభం: కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షక్ బిల్లు –2025ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్మి డి.రాము మాట్లాడుతూ గతంలో తీసుకొచ్చిన హెచ్‌ఈసీఐ బిల్లును కొత్త పేరుతో ఆమోదించడం వల్ల ఉన్నత విద్యను కేంద్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. యూజీసీ వంటి సంస్థలను రద్దుచేయడం వల్ల విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వ పట్టు పెరుగుతుందని, నిధులు గ్రాంట్ల స్థానంలో రుణాల రూపంలో మంజూరై విద్య సామాన్యులకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. ఈ బిల్లు సమా ఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. వెనుబడిన వర్గాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. నిరసనలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వి.చిన్నబాబు, సహాయ కార్యదర్ములు ఎం.వెంకీ, ఆర్.శిరీష్, ఉపాధ్యక్షులు రమణ, రమేష్, జగదీష్, జిల్లా కమిటీ సభ్యులు సూరిబాబు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం
విజయనగరం గంటస్తంభం: ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలోకి నెట్టేసి, ప్రజావైద్యాన్ని అమ్మకానికి పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఐ జిల్లా నాయకులు స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లడమేనని, ప్రభుత్వ బాధ్యతను కార్పొరేట్ చేతులకు అప్పగించే చర్యగా అభివర్ణించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం ఉద యం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జీఓ 590 జారీచేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుగత పావని, పురం అప్పారావు, జిల్లా సమితి సభ్యులు పి.అప్పలరాజు, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ఎన్.నాగభూషణం, బి.వాసు, తదితరులు పాల్గొన్నారు.
ధ్యానదినోత్సవానికి తరలిరండి
ధ్యానదినోత్సవానికి తరలిరండి


