 
															● ఈ షెడ్డులో చదువుకోలేం
ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకుల షెడ్ చూశారా... ఇది బొబ్బిలి మండలం బట్టివలస గిరిజన గ్రామంలో కొత్తగా నిర్మించిన పాఠశాల భవనమట. ఇక్కడ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు చదువుతున్నారు. ఒక రెగ్యులర్ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. గతేడాది వరకు పూరిపాకలో పాఠశాల నిర్వహణ జరగ్గా అది కూలిపోవడంతో పక్కనే ఉన్న చర్చిలో చదువులు సాగిస్తున్నారు. విద్యార్థుల సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పలు మార్లు ఆందో ళన చేసినా స్పందన శూన్యం. యూటీఎఫ్ నాయకురాలు విజయగౌరి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా ఆయన గ్రామ సర్పంచ్‌కు రూ.50 వేలతో పాఠశాల గదిని నిర్మించాలని సూచించారు. డబ్బులు కూడా ఇచ్చారు. పశువులకు నిర్మించినట్టు చిన్నషెడ్డు వేసి కనీసం గచ్చులు కూడా చేయకపోవడంతో అందులో చదువుకునేందుకు చిన్నారులు నిరాకరించారు. ఎండ కాస్తోందని, వర్షం వస్తే తడిచిపోతున్నాంటూ ఆవేదన వ్యక్తంచేస్తూ మళ్లీ చర్చిలోనే చదువులు సాగిస్తున్నారు. పిల్లల చదువుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, పక్కా భవనాన్ని మంజూరు చేయించలేకపోవడం ఎమ్మెల్యే బేబినాయన అసమర్థపాలనకు నిదర్శనమంటూ గ్రామస్తులు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
– బొబ్బిలిరూరల్
 
							● ఈ షెడ్డులో చదువుకోలేం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
