
కార్పొరేట్ శక్తుల చేతుల్లో దేశ సంపద
బొబ్బిలి: మతోన్మాదంతో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల ముగింపు సభలో ఆదివారం ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు రైతులు, ఆదివాసీలను సంక్షేమ రంగంలో పయనించేలా బీజేపీ యేతర పాలన రావాలన్నారు. అద్వానీ రామ జన్మభూమి రధయాత్రలో కమలం గుర్తును ప్రచారం చేశారని గుర్తు చేశారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో పవిత్ర గంగాజలం పేరుతో రూ.10, రూ.20లకు అమ్మకం చేసి రామశిలపై బొట్లు పెట్టి రాజకీయాలకు వాడుకున్నారన్నారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలన్నారు. పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం 80 శాతం పక్కదారి పడుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. పన్నుల ధనాన్ని కూడా వృథా చేస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జనసేన నాయకుడు పవన్‌కల్యాణ్ గతంలో చేగువేరానని, కమ్యూనిస్టుని అని చెప్పుకుని మతోన్మాద బీజేపీలో చేరాక హరిహర వీరమల్లు చిత్రం తీసి తన మతోన్మాదం చూపారన్నారు. సీపీఐ గొంతులేని వాళ్లకు గొంతు ఇస్తుందన్నారు. కార్మికులు రక్తతర్పణం చేసి సాధించుకున్న 44 చట్టాలను లేబర్‌కోడ్స్‌గా మార్పు చేసి కార్మికుల కడుపు కొట్టార్టరన్నారు. రాష్ట్రంలో టీడీపీ మరోసారి అధికారంలోకి రాకుండా ప్రజలు ముందుకు రావాలన్నారు. ఓంకార్ థియేటర్ వద్ద ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, సహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, నియోజకవర్గ కార్యదర్శి కండాపు ప్రసాదరావు, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాసరావు, పలువురు కామ్రేడ్‌లు పాల్గొన్నారు.
మతోన్మాద బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించండి సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు
చేగువేరానని చెప్పుకునే పవన్‌కల్యాణ్
బీజేపీలో చేరాకే హరిహర వీరమల్లు తీశారు
ముగిసిన సీపీఐ జిల్లా మహాసభలు