
దివ్యాంగులతో సదరంగం..!
● సర్టిఫికెట్స్ జారీలో అలసత్వం
● ఆస్పత్రిలో అటెండ్ అయి నెలలు గడుస్తునా కానరాని ఫలితం
● ఆందోళన చెందుతున్న దివ్యాంగులు
● స్పష్టమైన సమాధానం చెప్పని
వైద్యాధికారులు
విజయనగరంఫోర్ట్: మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన పాలవలస స్వామినాయుడు అనే ఎముకల సంబంధిత దివ్యాంగుడు సదరం సర్టిఫికెట్ కోసం సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నారు. స్వామినాయుడికి 2024 డిసెంబర్ 10వతేదీన ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో సదరం సర్టిఫికెట్ కోసం అటెండ్ (హాజరు) అవ్వాలని వచ్చింది. దీంతో ఆ రోజున ఎస్. కోట ఏరియా ఆస్పత్రిలో అటెండ్ అయ్యాడు. ఆస్పత్రికి హాజరై 7 నెలలైంది. ఇంతవరకు ఆయనకు సదరం సర్టిఫికెట్ జారీ కాలేదు. ఆస్పత్రిలో అడిగితే స్పష్టమైన సమాధానం ఇవ్వడంలేదని వాపోతున్నాడు.
ఈ ఒక్క దివ్యాంగుడే కాదు. అనేక మంది ఈ విధంగా సదరం సర్టిఫికెట్స్ జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాపోతున్నారు. అయితే చాలా మంది దివ్యాంగులు ఆస్పత్రికి వెళ్లాం కదా.. సదరం సర్టిఫికెట్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరి కొంతమంది సదరం సర్టిఫికెట్స్ రాకపోతే ఎవరిని అడగాలో తెలియక మిన్నుకుండిపోతున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం ఆస్పత్రికి హాజరైన వారికి వారం, 10 రోజుల్లో జారీ కావాల్సి ఉంది. కానీ నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్స్ అందడంలేదని తెలుస్తోంది.
సదరం సర్టిఫికెట్ ఈ విధంగా జారీ..
కంటి, ఎముకలు, న్యూరో, ఈఎన్‌టీ, మానసిక విభాగాలకు చెందిన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. సంబంధిత విభాగాలకు చెందిన దివ్యాంగులు అధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్‌తో సంబంధిత సచివాలయాలనికి స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పడు సచివాలయానికి వెళ్తే అక్కడ ఆయా విభాగాలకు ఏ ఆస్పత్రికి వెళ్లాలో స్లాట్స్ బుక్ చేస్తారు. ఆ తేదీన ఆస్పత్రికి వెళ్తే ఆయా విభాగానికి చెందిన వైద్యుడు దివ్యాంగుడిని పరీక్షించి వైకల్యం ఎంత ఉందో రాసి సదరం సర్టిఫికెట్ జారీ చేస్తారు. సదరం సర్టిఫికెట్ (పర్మినెంట్) శాశ్వతంగా ఉంటేనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తాత్కాలిక సర్టిఫికెట్ అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్స్ జారీలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రుల్లో సర్టిఫికెట్ జారీ చేయడంలో వైద్యులు అలసత్వం వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 36 వేల మందికి దివ్యాంగుల పింఛన్
జిల్లాలో 36 వేల మందికి పైగా దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దివ్యాంగ పింఛన్లు పొందే వారికి పింఛన్ రీ వెరిఫికేషన్ చేయిస్తోంది. దీంతో దివ్యాంగులంతా ఆయా ఆస్పత్రులకు రీ వెరిఫికేషన్‌కు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క దివ్యాంగ పింఛన్ కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు.
విచారణ చేసి చర్యలు
సదరం సర్టిఫికెట్‌కు దివ్యాంగుడు ఆస్పత్రికి హాజరైన 10, 15 రోజుల్లో జారీ చేయాలి ఎందుకు జాప్యం జరుగుతోందో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ ఎన్.పి. పద్మశ్రీ రాణి, డీసీహెచ్‌ఎస్

దివ్యాంగులతో సదరంగం..!