గంజాయి నిందితుల ఆస్తులపై విచారణ | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుల ఆస్తులపై విచారణ

Jul 17 2025 3:13 AM | Updated on Jul 17 2025 3:13 AM

గంజాయి నిందితుల ఆస్తులపై విచారణ

గంజాయి నిందితుల ఆస్తులపై విచారణ

ఎస్పీ వకుల్‌ జిందల్‌

చింతలవలస వద్ద 37.550 కేజీల

గంజాయి పట్టివేత

డెంకాడ: గంజాయి నిందితుల ఆర్థిక మూలాలపై విచారణ జరిపి ఆస్తులను ఫ్రీజ్‌ చేస్తామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అన్నారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పినతాడివాడ వద్ద ఉన్న భోగాపురం సీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వకుల్‌ జిందల్‌ మాట్లాడారు. మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌ మెయిన్‌గేట్‌ సమీపంలో 26వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం కారులో తరలిస్తున్న 37 కేజీల 550 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు చెప్పారు. కచ్చితమైన సమాచారంతో డెంకాడ పోలీసులు, ఈగల్‌ పోలీసులు సంయుక్తంగా ఏపీఎస్‌పీ బెటాలియన్‌ మెయిన్‌గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా విజయనగరం నుంచి విశాఖ వెళ్తున్న కారులో 37.550 కేజీల గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఒడిశాలో కారులో గంజాయిని లోడ్‌ చేసి విశాఖకు తరలిస్తుండగా పట్టుబడ్డారని తెలియజేశారు. కారులో గంజాయి తీసుకువెళ్తున్న ఒడిశాకు రాష్ట్రంలోని కొరాపుట్‌ జిల్లాకు చెందిన బసుదేవ్‌ సిపా అలియాస్‌ భాస్కర్‌ గొల్లారి, అజయ్‌ గంటలను పట్టుకున్నామని తెలిపారు. వారిద్దరినీ అదే రాష్ట్రానికి చెందిన రాజేష్‌ అలియాస్‌ గణేష్‌ అనే వ్యక్తి రూ.5వేలకు ఎంగేజ్‌ చేసుకున్నాడని చెప్పారు. రాజేష్‌ను కూడా త్వరలో పట్టుకుంటామన్నారు. ఒడిశా నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని హైదరాబాద్‌, బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. ఒడిశా నుంచి గంజాయిని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకునేందుకు పోలీస్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అయితే నిందితులు చెక్‌పోస్టులున్నందున లూప్‌ లైన్లలో రవాణా చేస్తున్నారన్నారు. వాటిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ఈ మధ్య కాలంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా రవాణా చేస్తున్నట్లు గుర్తించామని, దీంతో ఈ ప్రాంతాల్లో కూడా పోలీస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గంజాయి రవాణా చేసినా, నిల్వ ఉంచినా, అమ్మినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పట్టుబడిన నిందితులపై గంజాయి కేసుతోపాటు వారి ఆర్థిక మూలలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజయనగరం పట్టణంలో గంజాయి నివారణకు పూర్తిగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిలో భాగంగా పలువురిని పట్టుకుని కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు కూడా తీసుకున్నామన్నారు. కేసులో క్రియాశీలకంగా పని చేసిన భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్సై ఎ.సన్యాసినాయుడు, సిబ్బంది, ఈగల్‌ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

రికార్డుల పరిశీలన

డెంకాడ పోలీస్టేషన్‌ను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సందర్శించిన సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. బ్లాక్‌స్పాట్స్‌ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసులు త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. పోలీస్టేషన్‌లో వివిధ రికార్డులను, సీడీ ఫైల్స్‌, జనరల్‌ డైరీ, బెయిల్‌ బుక్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్సై ఎ.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement