విజయనగరం: ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 12, 13 తేదీల్లో అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. కాటా, కుమిటీ విభాగాల్లో జరిగిన పోటీల్లో పి.హేమంత్ రెండు బంగారు పతకాలు, కె.శివగణేష్ బంగారు, సిల్వర్ పతకాలు, ఎల్.జశ్వంత్ బంగారు, సిల్వర్ పతకాలు కై వసం చేసుకున్నారు. అదేవిధంగా పి.వెంకటరమణ కె. మోహన్‌రావు, కె.పరమేష్, ఎన్.జనని, కె.స్నేహ, వి.ఇంద్రాణి, ఎం.సాత్విక్, బి.లెనిన్, జి.వివేక్ వర్మలు పతకాలు సాధించిన వారిలో ఉన్నారు. పోటీల్లో పతకాలు దక్కించుకున్న క్రీడాకారులను కరాటే అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సంతోష్ కుమార్ అభినందించారు.