
బిల్లుల భారం మోయలేం బాబూ..!
నెల్లిమర్ల రూరల్: మా ఇళ్లలో ఒక ఫ్యాన్, రెండు బల్బులు, ఒక టీవీ మాత్రమే ఉన్నాయి. పగలంతా పనుల కోసం బయటకు వెళ్లిపోతాం. అసలు విద్యుత్ వినియోగమే ఉండదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కూడా ఉంది. కానీ వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వద్ద శుక్రవారం వాపోయారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ రచ్చబండ కార్యక్రమంలో ఆయనకు విద్యుత్ బిల్లులు చూపించి గగ్గోలుపెట్టారు. తమకు రూ.రూ.4,085 బిల్లు వచ్చిందని బూసరి రాములమ్మ వాపోగా, బూసరి ఎల్లయ్యకు రూ.5,787, బూసరి రాముడుకు రూ.2,219 చొప్పున విద్యుత్ బిల్లులు వచ్చాయని తెలిపారు. ఇంత పెద్దమొత్తంలో విద్యుత్ బిల్లులు ఎన్నడూ చూడలేదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమలాగే దళిత కాలనీలో చాలా మందికి వేలకువేలు బిల్లులు వచ్చాయని..న్యాయం చేయాలంటూ బడ్డుకొండ ఎదుట వాపోయారు. బడ్డుకొండ వెంటనే స్పందించి బాధితుల ఎదుటే విద్యుత్ శాఖ ఏఈ పిచ్చయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. నిరుపేదలకు వేలకు వేలు బిల్లులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు అంతమొత్తంలో బిల్లులు ఎలా చెల్లించగలరన్నారు. తక్షణమే బాధితుల మీటర్లను పరిశీలించి బిల్లులను సరి చేయాలని కోరారు.
గతంలో చిల్లిగవ్వ కూడా కట్టలేదు
గత ప్రభుత్వంలో ఎస్సీలకు రాయతీ విద్యుత్‌లో భాగంగా చిల్లి గవ్వ కూడా డబ్బులు చెల్లించలేదు. అసలు 200 యూనిట్ల లోపే తామంతా విద్యుత్‌ను వినియోగిస్తాం. గడిచిన రెండు నెలలుగా వేలాది రూపాయల బిల్లులు వస్తున్నాయి. దీనిపై విద్యుత్ అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు.
– బూసరి చంటి, బాధితుడు,
ఒమ్మి గ్రామం, నెల్లిమర్ల మండలం
రాయితీ సదుపాయం ఉంది
ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్లలోపు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ప్రతినెలా ఈ విధానం కొనసాగుతోంది. కాకపోతే ప్రతి నెల బిల్లులో వచ్చిన ఇతర చార్జీలు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్ల నుంచి ఇతర చార్జీలు చెల్లించకపోవడంతోనే అధిక మొత్తంలో బిల్లులు చూపిస్తున్నాయి. గ్రామాన్ని సందర్శించి బిల్లులపై పూర్తి వివరణ ఇస్తాం.
– పిచ్చయ్య, విద్యుత్ ఏఈ, నెల్లిమర్ల మండలం

బిల్లుల భారం మోయలేం బాబూ..!