
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
● మరొకరికి గాయాలు
భామిని: మండలంలోని డోకుల గూడకు చెందిన గిరిజనుడు కొండగొర్రి నాగేష్(49)బుధవారం బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. భామిని నుంచి డోకులగూడవైపు వెళ్తుండగా ఏబీ రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడని బత్తిలి పోలీసులు తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని నేలమానుగూడలో అత్తవారింటికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న మరో యువకుడు బిడ్డిక సంజీవ్ తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. భామిని పీహెచ్‌సీలో ప్రాథమిక వైద్య సేవలు అందించి 108 అంబులెన్స్‌పై పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లలిత ఫిర్యాదు మేరకు బత్తిలి ఏఎస్సై కొండగొర్రి కాంతారావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ గ్రామానికి చెందిన గుగ్గిలాపు శంకరరావు(26) బుధవారం ఉదయం సుమారు 3 గంటల సమయంలో విశాఖపట్నంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలం క్రితం శంకరరావు తన భార్య హేమతో కలిసి విశాఖపట్నానికి బతుకు తెరువు కోసం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అయితే శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మృతుడికి ఇద్దరు పిల్లలు, తండ్రి రామిశెట్టి, తల్లి సావిత్రమ్మ, అక్క, అన్నయ్య ఉన్నారు.
ఉరివేసుకుని మరో వ్యక్తి..
భోగాపురం: మండలంలోని దల్లిపేట గ్రామంలో మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దల్లి అప్పలరెడ్డి(38)కి వివాహమై సుమారు 15 ఏళ్లు అవుతోంది. భార్య ఎర్రమ్మ, ఒక పాప ఉన్నారు. మద్యానికి బానిసైన అప్పలరెడ్డి నిత్యం మద్యం తాగుతూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో భార్య ఎర్రమ్మ మందలించడంతో మనస్తాపం చెంది సమీపంలోని ఓ లే అవుట్‌లో బుధవారం చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో భోగాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోరపాడు సమీపంలోనే ఏనుగులు
సీతంపేట: గడిచిన వారం రోజులుగా నాలుగు ఏనుగుల గుంపు గోరపాడు సమీపంలో తిష్టవేసింది. దీంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. కొండపోడు వ్యవసాయంలో పండిస్తున్న పైనాపిల్ పండ్లను ఏనుగులు తినేస్తున్నాయని వాపోతున్నారు. పోడు పనులకు సైతం అటువైపు వెళ్లడం లేదని గిరిజనులు తెలిపారు. అటవీశాఖ సిబ్బంది ఏనుగుల గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఏనుగులు తిరిగే వైపు వెళ్లవద్దని గిరిజన రైతులకు సూచిస్తున్నారు.

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి