ఫలించని గురువుల నిరీక్షణ
● ‘మాన్యువల్’ కౌన్సెలింగ్‌కు తొలిరోజు సాంకేతిక ఆటంకాలు
● నేటికి వాయిదా
విజయనగరం అర్బన్: గురువుల తొలిరోజు నిరీక్షణ ఫలించలేదు. పోరాడి సాధించుకున్న మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేచి చూశారు. చివరకు సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలతో ఎస్‌జీటీల బదిలీల ప్రక్రియను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం బదిలీ కౌన్సెలింగ్‌కు సిద్ధమైంది. సీరియల్‌లో ఉన్న తొలి 400 మంది ఉపాధ్యాయులకు సమచారం ఇవ్వడంతో వారంతా జెడ్పీ సమావేశ మందిరం వద్దకు చేరుకున్నారు. పాఠశాలవిద్య కమిషన్ నుంచి కౌన్సెలింగ్‌కు సంబంధించి రావాల్సిన లింక్ రాకపోవడంతో వాయిదా వేశారు. బుధవారం నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిన ఉపాధ్యాయులకు సీరియల్ నంబర్ ప్రకారం సమాచారం పంపుతామని తెలిపారు.
నిరసన..
ఉమ్మడి విజయనగరంలో నూతనంగా ఏర్పడిన క్లస్టర్ కేంద్రాల్లో పోస్టుల ఖాళీలను చూపించకపోవడంపై ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు నిరసన తెలిపారు. తొలుత డీఈఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత ఖాళీలను ప్రస్తుతం చూపించాలన్న నిబంధనలు లేవని, బదిలీల ప్రక్రియ చివర్లో వాటిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని డీఈఓ వివరించారు. దీనిని వ్యతిరేకిస్తూ కౌన్సెలింగ్ ప్రాంగణంలోనే ఉపాధ్యాయులు నిరసనకు దిగారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు
మెంటాడ: సాలూరు నుంచి మెంటాడ వైపు గ్రీన్‌ఫీల్డ్ హైవే మీదుగా మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు బిరసాడవలన వద్ద ప్రమాదానికి గురయ్యారు. బైక్ స్కిడ్ కావడంతో రోడ్డుపై బోల్తా కొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. అపస్మారక స్థితికి చేరుకున్నారు. యువకులు ఇద్దరిదీ అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ గూడెం గ్రామంగా పోలీసులు గుర్తించారు. వీరిని వైద్యచికిత్స కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ కె.సీతారాం పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఫలించని గురువుల నిరీక్షణ


