
ఉద్యోగాల కల్పనకు కృషి
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం రూరల్: ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తోందని రాష్ట్ర సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాను సోమవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతలో నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటుచేయనున్నామన్నారు. పార్కుల ఏర్పాటు ద్వా రా పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధి కి శతశాతం కృషి జరుగుతుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో పార్మాక్లస్టర్, పెట్రో కెమికల్స్, పరిశ్రమలు, స్టీల్స్‌పరిశ్రముల ఏర్పాటు కానున్నాయన్నారు. యువతకు వేతనం తక్కువైనా సరే అవకాశాన్ని అందిపుచ్చుకుని అనుభవాన్ని సంపాదించిన నాడు జీవితంలో మరింత ఉన్నతస్ధాయికి చేరుకుంటారని సూచించారు. ప్రతి ఒక్కరు జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాధికారి జి.ప్రశాంత్‌కుమార్, సంబంధిత శాఖ సిబ్బంది, టీడీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.