
మామిడి కాయలు నిల్వ చేసిన ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
గంట్యాడ: మండలంలోని రామవరం గ్రామంలో కాకర్లపూడి రామకృష్ణరాజు, సిరపురపు శివ అనే వ్యక్తుల ఇళ్లలో నిల్వ చేసిన మామిడి కాయలపై విజిలెన్స్, ఆహార తనిఖీ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణ రాజు, శివలు పండించిన మామిడి కాయలకు మంచి రంగు వచ్చి ఆకర్షణీయంగా కనబడడానికి, తద్వారా పళ్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి మామిడి కాయలకు ఈపి–50, రిఫాన్ అనే కెమికల్ ద్రావణం ఉపయోగించి రంగు వచ్చిన తర్వాత మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ ఈ విధంగా కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించరా దన్నారు. ఇలా పండించడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. కృత్రిమంగా కెమికల్స్ వాడి మామిడి కాయలు పండించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఆహార భద్రత అధికారులు కెమికల్ స్ప్రే చేసిన మామిడి కాయల నమూనాను సేకరించి వాటిని రసాయన పరీక్ష నిమిత్తం నాచారాం, హైదరాబాద్‌కు పంపి దాని రిపోర్ట్ అధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ తనిఖీలో విజిలెన్స్ అధికారులు సీఐ సింహాచలం, హెచ్‌సీ కామేశ్వరావు, పురుషోత్తం పాల్గొన్నారు.