
ఉపాధిలో బినామీ మస్తర్లు..!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల పేరిట మస్తర్లు
ఉపాధి హామీ పథకంలో డబ్బులు దోచేందుకు అడ్డదారులను వెతుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారి పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మేట్‌లైతే తమ భార్య/భర్తల పేరిట బినామీ మస్తర్లు వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
● మేట్ల అండతో కూటమి నేతల దోపిడీ
● ప్రభుత్వ ఉద్యోగులు సైతం పనికి
వస్తున్నట్లు మస్తర్లు
● లక్షలాది రుపాయలు స్వాహా
విజయనగరం ఫోర్ట్:
● గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఎస్.సత్యనారాయణ అనే వ్యక్తి ఉపాధి హామీ పనికి వెళ్లకపోయినా వెళ్లినట్లు మస్తరు వేశారు. ఆయన విజయనగరం కలెక్టరేట్‌లోని సర్వశిక్ష అభియాన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మే నెలలో ఆయన పనికి వెళ్లినట్లు మస్తర్ వేయగా ఆయనకు రూ.1260 వేతనం జనరేట్ అయింది.
● ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే మరో వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఈయన ఏప్రిల్, మే నెలల్లో పనికి వెళ్లినట్లు మస్తర్ వేశారు. దీంతో ఈ అధ్యాపకుడికి మూడు వారాలకు గాను రూ.3356 వేతనం జనరేట్ అయింది. వీరితో పాటు మరి కొంతమందికి కూడా బినామీ మస్తర్లు వేశారని గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు ఎంపీడీఓ ఆర్‌వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఈ ఒక్కగ్రామంలోనే కాదు. జిల్లాలోని అనేక చోట్ల బినామీ మస్తర్లు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బయటపడుతున్నాయి. మరి కొన్ని చోట్ల గుట్టుగా సాగి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోకుండా అధికారులు చోద్యం చూడడం వల్లే ఉపాధి హామీలో అక్రమాలు పెరిగిపోతున్నాయనే వ్యాఖ్యానిస్తున్నారు.
కూటమి సర్కార్ వచ్చాక పెరిగిన అవినీతి
కూటమి సర్కార్ రాష్ట్రంలో ఏర్పాటైన తర్వాత ఉపాధి హామీ పథకంలో అవినీతి పెచ్చు మీరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో పనిచేసిన మేట్లను తొలగించి కూటమికి చెందిన సానుభూతిపరులను మేట్‌లుగా నియమించుకున్నారు. అధికారులు కూడా కూటమి నేతల ఆదేశాలకు వంత పాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతలు నియమించుకున్న మేట్‌ల ద్వారా బినామీ మస్తర్లు వేసుకుని కాసులు దండుకుంటున్నట్లు విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నా అధికార పార్టీ వారు కావడంతో అధికారులు ఏమీ అనకుండా చూసీచూడనట్లు ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బినామీ మస్తర్ల ద్వారా లక్షలాది రుపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో 3.53 లక్షల జాబ్ కార్డులు ఉండగా అన్నీ యాక్టివ్‌లో ఉన్నాయి. జిల్లాలో 6.08 లక్షల వేతనదారులు ఉన్నారు. వారిలో 5.95 లక్షల మంది వేతనదారులు ఉపాధి పనులకు వెళ్తారు.
బినామీ మస్తర్లపై విచారణ చేపట్టి చర్యలు
ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు పాల్ప డిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నాం.
ఎస్.శారదా దేవి, పీడీ, డ్వామా

ఉపాధిలో బినామీ మస్తర్లు..!

ఉపాధిలో బినామీ మస్తర్లు..!