
బావిలో పడి మతిస్థిమితంలేని మహిళ మృతి
రాజాం సిటీ: కుమారుడు మృతిచెందడంతో మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ నేలబావిలో పడి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్సై వై.రవికిరణ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యురుకు చెందిన పోతిరెడ్డి కుమారి (45) ఏడాది క్రితం రాజాం వచ్చి గాయత్రికాలనీలో నివాసం ఉంటోంది, ఆమె రెండో కుమారుడు నరేంద్ర నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఆమె అప్పటినుంచి మానసికంగా ఇబ్బందులు పడి మతిస్థిమితం కోల్పోయి అనారోగ్యం పాలైంది. దీంతో కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యసేవలు అందించారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయటకు వెళ్లిపోవడం కుటుంబసభ్యులు వెతికి తీసుకురావడం పరిపాటిగా మారింది. నాలుగు రోజుల క్రితం తన పెద్దకుమారుడు సాయితేజ రాగోలు జెమ్స్‌కు తీసుకువెళ్లి చికిత్స అనంతరం మృతురాలి తమ్ముడైన తెలగవీధిలో నివాసం ఉంటున్న కొనిశెట్టి ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద ఉంచారు. ఈ నెల 20వ తేదీ రాత్రి ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్లిపోయిన విషయాన్ని బుధవారం కుటుంబ సభ్యులు తెలుసుకుని అన్ని ప్రాంతాల్లో వెతికారు. తెలగవీధి శ్మశానవాటిక వెనుకభాగంలోని నేలబావిలో ఆమె మృతదేహం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేక బావిలోపడి మృతిచెందినట్లు మృతురాలి కుమారుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.రవికిరణ్ తెలిపారు.