
పశువైద్య విద్యార్థుల డిమాండ్లు నెరవేరేనా?
● గరివిడి వెటర్నరీ కళాశాలకు వీసీఐటీఎం రేపు రాక ● 16వ తేదీ వరకు కళాశాల పరిశీలన
చీపురుపల్లిరూరల్(గరివిడి): వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన బృందం గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు ఈనెల 14న రానుంది. 16వ తేదీ వరకు కళాశాలలోనే ఉండి సదుపాయాల ను, విద్యార్థుల సమస్యలను తెలుసుకోనుంది. వాస్తవంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి వీసీఐ బృందం వెటర్నరీ కళాశాలలను సందర్శించడం, నివేదికను ఉన్నతాధికారులకు అందజేయడం పరిపాటి. అందులో భాగంగానే గరివిడి కళాశాలకు బృందం రానుంది. కళాశాలలో ఫ్యాకల్టీ పరిస్థితి, భవన సదుపాయాలు, ల్యాబ్, వసతులు తదితరవి పరిశీలించనుంది.
న్యాయం జరుగుతుందా...
వీసీఐ బృందానికి ఈ సారి విద్యార్థుల నుంచి డిమాండ్లు వినిపించనున్నవి. కళాశాలకు వీసీఐ గుర్తింపుతో పాటుగా స్టైఫండ్‌ను రూ.7,600 నుంచి రూ.25 వేలకు పెంచాలని కోరుతూ విద్యార్థులు సుమారు రెండు నెలలపాటు ఆందోళనలు కొనసాగించారు. వీరి సమస్యను పరిష్కరించడంలో కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. విద్యార్థులను రోడ్డె క్కించింది. 327 మంది వెటర్నరీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరవధిక దీక్షలు చేపట్టారు. కళాశాల నుంచి రిలీవ్ కాబోతున్న విద్యార్థులకు వీసీఐ గుర్తింపు లేకపోతే వెటర్నరీ విద్యను అభ్యసిస్తున్న తమ జీవితాలు ఏమి కావాలని అప్పట్లో ప్రశ్నించారు. కళాశాలలో సరిపడా భవనాలు, ల్యాబ్ సౌకార్యాలు, వసతులు, అధ్యాపక సిబ్బంది లేని కారణంగా వీసీఐ గుర్తింపు రావడంలేదని, కళాశాలకు గుర్తింపు ఉంటేనే ఇంటర్న్‌షిప్‌లో ఎన్‌రోల్ కావడానికి, పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్ర న్స్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంద న్నది విద్యార్థుల వాదన. విద్యార్థుల డిమాండ్ల మేరకు వారి స్టైఫండ్‌ను రూ.7,600 నుంచి రూ. 10వేలకు పెంచుతూ జీఓ విడుదల చేయడంతో విద్యార్థులు నిరవధిక దీక్షను విరమించారు. కళాశాలకు వస్తున్న వీసీఐ బృందానికి తమ డిమాండ్లను వినిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.