
ఇంటర్‌లో కొత్తపాఠాలు
● సీబీఎస్‌ఈ అమలుకు సిద్ధం
● అధ్యాపకులకు శిక్షణ పూర్తి
● విద్యార్థులకు అదనపు ప్రయోజనం
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ విద్యాబోధనలో నూతన సంస్కరణలను ప్రభుత్వం ఈ ఏడాది చేపడుతోంది. జూనియర్ కళాశాలల్లో సీబీఎస్‌ఈ అమలుకు ఇప్పటికే అడుగులు పడ్డాయి. కొత్తగా ఎంబైపీసీ కోర్సును అమలుచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అధ్యాపకులకు శిక్షణ సైతం ఇచ్చారు. మిగిలిన గ్రూపుల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ప్రకారం పరీక్షల విధానం, మార్కుల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 18 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫాకల్టీ అధ్యాపకులకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు స్పెల్‌లలో ఇటీవల శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశారు.
కోర్సుల నూతన విధానం
ఒకే సబ్జెక్టుగా గణితం–ఎ, ఎ, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం కలిపి బయాలజీగా రూపొందించారు. ఇందుకు తగ్గట్లు మార్కుల విభజన చేశారు. పార్ట్–1 సబ్జెక్టు కింద ఆంగ్లమే ఉంటుంది. పార్ట్–2 కింద జాతీయ భాషలతోపాటు మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థి అభీష్టం మేరకు దేనినైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పార్ట్–3లో ఎంపీసీ, బైపీసీ సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ గ్రూపులుంటాయి. సెకెండ్ లాంగ్వేజీకి సంబంధించి తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులు గణితం, ఎంపీసీలో చేరిన వారు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూకు బదులుగా బయాలజీని తీసుకోవచ్చు.
విద్యార్థులకు అదనపు ప్రయోజనం
నూతన విధానంలో భాగంగా ఎంపీసీ తీసుకున్న విద్యార్థి అదనంగా బయాలజీ, బైపీసీ తీసుకున్నవారు గణితం తీసుకునే అవకాశం కల్పించారు. పార్ట్–1, 2, 3 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే పరిగణిస్తారు. అదనంగా తీసుకున్న సబ్జెక్టుల మార్కులను ఇందులో కలపరు. కనీసం 35 మార్కులొస్తేనే ఉత్తీర్ణత సాధించినట్లు. ఉత్తీర్ణులు కాకపోయినా ధ్రువీకరణ పత్రం ఇస్దారు. అదనపు సబ్జెక్టులో ఉత్తీర్ణులైతే భవిష్యత్తులో మెడికల్, ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ తదితర కోర్సులు అభ్యసించేందుకు అవకాశం ఉంటుంది. సదరు విద్యార్థి నీట్, ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త సిలబస్ ఆధారంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలకు ప్రశ్రపత్రాలు మారుతాయి. ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సిలబస్‌లో గానీ, పరీక్ష ప్రశ్నపత్రంలో గానీ ఎటువంటి మార్పు ఉండదు.
విద్యార్థులకు మంచి అవకాశం
ఇంటర్‌లో ఎంబైపీసీ కోర్సులు విద్యార్థులకు విభిన్న రంగాలలో చదువుకోవడానికి మంచి అవకాశం. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో పోటీపడే అవకాశాలు లభిస్తాయి. సీబీఎస్‌ఈ సిలబస్ పాఠ్యాంశాల మార్పులతో పాటు కొత్తకోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తున్నాయి. విద్యార్ధులు సద్వినియోగం చేసుకుంటే ఉన్నతవిద్యలో మరిన్ని అవకాశాలు సాధ్యం.
శివ్వాల తవిటినాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈఓ)

ఇంటర్‌లో కొత్తపాఠాలు