విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు శుక్రవారం స్వర్ణ పుష్పార్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ఇంచార్జ్ ఈవో కెఎన్‌విడివి.ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
అందరి సమన్వయంతోనే అభివృద్ధి
● మున్సిపల్ ఆర్‌డీ రవీంద్ర
విజయనగరం గంటస్తంభం: అన్ని శాఖల సమన్వయంతో నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందే దిశగా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ వి.రవీంద్ర అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయానికి శుక్రవారం విచ్చేసిన ఆయన వివిధ విభాగాల అధిపతులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. విభాగాల వారీగా ప్రగతి నివేదికలను పరిశీలించి, వాటి ఆధారంగా పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. అంతకు ముందు నగరంలోని అన్నా క్యాంటీన్‌లను పరిశీలించారు. పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వసతిగృహాల తనిఖీ
విజయనగరం లీగల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ విజయనగరంలో ఉన్న కొన్ని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లను శుక్రవారం తనిఖీ చేశారు. విజయనగరం కొత్తపేటలోని సోషల్ వెల్ఫేర్ బాలుర వసతిగృహం, విద్యుత్ స్టేడియం దగ్గర్లో ఉన్న బాలుర వసతిగృహం, నెల్లిమర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేశారు. వంట, భోజన శాలలను, మరుగుదొడ్లు, స్టోర్ రూములను పరిశీలించారు. వసతిగృహాల సీలింగ్, ప్రహరీల విషయమై సూపర్‌వైజర్‌ను అడిగి తెలుసుకున్నారు. వంట గదులు, భోజన శాలలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని హోమ్ నిర్వాహకులకు, ఆయాలకు వంట వారికి హితవు పలికారు. వసతిగృహాల రిజిస్టర్లను రికార్డులను పరిశీలించారు. జిల్లాలో ఉన్న అన్ని చిల్డ్రన్ హోమ్స్, ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ వసతిగృహాలను సందర్శించి వాటి నివేదికలను రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థకు పంపుతామని తెలిపారు.
తివ్వా కొండల్లో ఏనుగులు
భామిని: మండల సరిహద్దులోని తివ్వా కొండల్లోకి ఏనుగులు శుక్రవారం వెళ్లాయి. మండలంలో కురుస్తున్న అకాల వర్షాలకు నాలుగు ఏనుగులు తాటిమానుగూడ – ఇప్పమానుగూడ మీదుగా కొండల పైకి చేరుకున్నాయి. వర్షాకాలంలో బురద ప్రాంతాల్లో ఏనుగులు ఉండలేవని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. కురుపాం – గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దులోని చీడిగూడ నుంచి తిత్తిరి వైపు వెళ్లిన ఏనుగులు తాజాగా తివ్వా కొండల్లోకి చేరుకున్నాయి.

పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన

పైడితల్లి అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన