
హైరిస్క్ గ్రామాల్లో ఫీవర్ సర్వే చేయాలి
సీతంపేట: హైరిస్క్ మలేరియా ప్రభావిత గ్రామాల్లో ఫీవర్ సర్వే పకడ్బందీగా చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్.భాస్కరరావు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక ఐటీడీఏలోని సీతంపేట, కుశిమి, దోనుబాయి, మర్రిపాడు, బత్తిలి, భామిని తదితర పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వరం, ఇతర వ్యాదులు ఉన్న వారికి వెంటనే తగిన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ ఐఆర్‌ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని స్ప్రేయింగ్ చేయాలని చెప్పారు. ఫాగింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలని కోరారు. దోమకాటు వ్యాధులపై ప్రజలకు విస్త్రతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏసీటీ, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి యాంటీ మలేరియా మందులు సమృద్ధిగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఉపవైద్యాశాఖాధికారి కె.విజయపార్వతి, డీఎంవో సత్యనారాయణ, సబ్‌యూనిట్ ఆఫీసర్ మోహన్‌రావు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో భాస్కరరావు