
అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన అవసరం
● జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి
విజయనగరం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ మే డే వారోత్సవాల్లో భాగంగా విజయనగరంలోని కార్మికశాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికశాఖలో అమలవుతున్న కేంద్రప్రభుత్వ పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎంతమంది కార్మికులు లబ్ధి పొందారో ఆరాతీశారు. అనంతరం కార్మిక శాఖ భవనం ఆవరణలో అసంఘటిత కార్మికులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్ అసంఘటిత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో వేతన సవరణ చట్టం, హక్కులు, బాధ్యతల గురించి తెలియజేశారు. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1 5 1 0 0కు ఫోన్ చేసి న్యాయ సలహాలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎ.శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నామినేటెడ్ సభ్యుడు జి.తిరుపతి పాల్గొన్నారు.