
గోపాలకృష్ణ మాస్టారుకు పురస్కారం
రేగిడి: మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన పుర్లి గోపాలకృష్ణ మాస్టారును తెలుగువెలుగు సాహితీవేదిక ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం రాత్రి విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ సాంస్కృతిక సేవా రంగంలో విశిష్టమైన కృషిచేసినందుకు గుర్తించి పురష్కారాన్ని అందించి సత్కరించారు. ఈ పురస్కారం అందించిన తెలుగువెలుగు కార్యనిర్వాహక కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నామనన్నారు. గోపాలకృష్ణ మాస్టారుకు పురష్కారం రావడంపట్ల అంబకండి గ్రామస్తులతో పాటు మండల విద్యాశాఖాధికారులు ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎంపీపీ దార అప్పలనర్సమ్మ, వైస్‌ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు తదితరులు అభినందించారు.
పెండింగ్ ఈ చలానాలపై ఎస్పీ సీరియస్
● చెల్లించని వాహనాలను సీజ్
చేయాలని ఆదేశాలు
విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఈ–చలానాల వసూళ్లపై అధికారులు, సిబ్బంది సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీస్ సిబ్బంది, అధికారులతో ఆదివారం ఆయన సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వాహనాల పెండింగ్ చలానాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి వాహనాల తనిఖీలు నిర్వహించి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆయా వాహనాలపై పెండింగ్ చలానాలు ఉన్నట్లయితే వాటిని వాహనదారులు చెల్లించేంతవరకు వెంటాడాలని ఎస్పీ ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఽఘిస్తున్న వారిపై ఈ చలానాలు విధిస్తున్నా చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ చలానాలు కుప్పలు, కుప్పలుగా పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు. సిబ్బంది పెండింగ్ ఈ చలానాలపై దృష్టి పెట్టాలని ఆ చలానాలు చెల్లించకపోతే వెంటనే వాహనాన్ని సీజ్ చేయాలని స్పష్టం చేశారు. అలాగే వాహనాల తనిఖీ సమయంలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు.ఇక ఎంవీ నిబంధనలను ఉల్లంఽఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు.
మహిళ దుర్మరణం
రామభద్రపురం: మండలకేంద్రంలోని సాలూరు వెళ్లే రూట్‌లో కర్రల మిషన్ సమీపాన జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున గుర్తుతెలియని వాహనం ఢీ కొని ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల సత్యవతి(64) కొన్నేళ్లుగా అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూలాగానే ఆదివారం కూడా వేకువజామున 5 గంటల సమయంలో కూరగాయల మార్కెట్‌కు వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి రెండు నిమిషాల్లో మార్కెట్‌కు వెళ్లే లింకు రోడ్డు దిగుతుందన్న సమయంలో సాలూరు నుంచి రామభద్రపురం వైపు వస్తున్న గుర్తుతెలియని వాహనం మితిమీరిన వేగంతో వచ్చి సత్యవతిని బలంగా ఢీ కొట్టి సుమారు 50 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె అక్కిడికక్కడే మృతిచెందింది. పోలీసులు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఢీ కొట్టిన వాహనాన్ని కనిపెడుతున్నారు. మృతురాలి కుమారుడు ఈశ్వరరావు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి మృతదేహాన్ని తరలించారు. కుమారుడు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏఎస్సై రమణ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోపాలకృష్ణ మాస్టారుకు పురస్కారం

గోపాలకృష్ణ మాస్టారుకు పురస్కారం