
విదేశీ అతిథులకు స్వాగతం
● సైబీరియా వలస పక్షుల రాక
● మే నెల నుంచి నవంబరు నెల వరకు విహారం
● నవంబరు తర్వాత స్వదేశానికి పిల్లలతో ప్రయాణం
బొండపల్లి: ఏటా క్రమం తప్పకుండా వచ్చే విదేశీ వలస పక్షులు సైబీరియా దేశం నుంచి వచ్చి చెరువుల్లో విహరిస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వేలాది కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా దేశం నుంచి ప్రయాణం చేస్తూ ఏటా వచ్చి బొండపల్లి మండలంలో విడిది చేసి ఆహారం సంపాదించుకునే ప్రాంతాలను గుర్తించేందుకు వచ్చే ఈ పక్షులు ఈ ఏడాది కూడా మండలానికి వచ్చాయి. మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న రాజు చెరువులో సంవత్సరం పొడవునా నీరు ఉండడంతో పాటు చెరువు గట్ల చుట్టూ దట్టమైన చెట్లు ఉండడం, పక్షులకు కావాల్సిన ఆహారం పీతలు, పురుగులు, ఇతర ఆహారం పుష్కలంగా దొరికే అవకాశం ఉండడంతో క్రమం తప్పకుండా ఇక్కడికి పొడవైన కాళ్లు, పొడవైన ముక్కు, తెల్లని రెక్కలు, మెడ కింద ఎర్రని వెంట్రుకలతో కూడిన ఈ పక్షులు దేశం కాని దేశం నుంచి వస్తుంటాయి.
నవంబర్ వరకూ ఇక్కడే బస
ఈ పక్షులు ఏటా మే నెలలో వచ్చి నవంబరు నెల వరకు చెరువుల్లో దొరికే ఆహారాన్ని పగలంతా సేకరించి తిని రాత్రయ్యే సరికి గజపతినగరం మండలంలోని లోగిస గ్రామంలో గల చింత చెట్లుపై విశ్రాంతి తీసుకుంటాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ పక్రియ సాగుతోంది. వాటికి ఏ ఒక్కరూ హాని చేయడం, వేటాడడం వంటి పనులు చేయరు. ఆ పక్షులకు హాని చేయకూడదని గ్రామస్తులు వారికి వారే అంక్షలు విధించుకుని..ఈ పక్షులు వస్తే తమకు మంచి జరుగుతుందని భావిస్తారు. మే నెలలో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలు ఎగిరి వాటికి అవే ఆహారం సంపాదించుకునే పరిస్థితి వచ్చాక పిల్లలతో సహా ఈ పక్షులు స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతుంటాయి. ఈ ప్రక్రియ ఏటా క్రమం తప్పకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఈ పక్షులు వచ్చి చెరువులో ప్రసుత్తం కనువిందు చేస్తున్నాయి.