
కూరగాయల ధరల పతనం వాస్తవమే..
రామభద్రపురం: ఈ ఏడాది వంగ, బెండ కూరగాయలతో పాటు పలు రకాల కూరగాయల ధరలు పతనం కావడం వాస్తవమేనని, మార్కెటింగ్ శాఖ అధికాకారులతో మాట్లాడి కూరగాయలకు మద్ధతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మండల ఉద్యానశాఖాధికారి పి.మోహనకృష్ణ అన్నారు. రైతన్నలు ఆరుగాలం శ్రమించి సాగుచేసిన కూరగాలయ పంటలకు మార్కెట్లో ధరలు పతనం కావడంతో కనీసం కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉంది. రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలకు ఊహించని రీతిలో ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై ఈ నెల 02వ తేదీన ‘కూరగాయల రైతు కుదేలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉద్యానశాఖాధికారి ఏవీఎస్‌వీ జమదగ్ని స్పందించారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రైతులతో మాట్లాడాలని మండల ఉద్యానశాఖాధికారి మోహనకృష్ణను ఆదేశించారు. ఆయన సీహెచ్ పైడిపునాయుడు, పూడి వెంకటరావుతో కలిసి రామభద్రపురంలో సాగుచేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కరోనా సమయంలో తప్ప ఈ సీజన్‌లో కూరగాయల ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఎన్నడూ చూడలేదని, క్రేట్‌తో కూరగాయలు మార్కెట్‌లో అమ్మేసి రవాణా, ఆశీలు చెల్లించి ఉత్తిచేతులతో ఇంటికి వెళ్లిపోతున్నామంటూ ఆవేదనను వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి పైసా సాయం అందడంలేదన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ రైతులంతా ఒకే పంట వేయకుండా డిమాండ్ ఉన్న మిశ్రమ పంటలు సాగుచేయాలని సూచించారు. 6 నెలల పంట కాలం ఉన్న గ్రాఫ్టెడ్ టమాటా, వంగ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యానశాఖాధికారులు పి. కొండలరావు, సీహెచ్ అప్పలనాయుడు, ఎల్.హైమావతి, తదితరులు పాల్గొన్నారు.
మద్ధతు ధర కల్పనకు చర్యలు తీసుకుంటాం
మండల ఉద్యానశాఖాధికారి మోహనకృష్ణ

కూరగాయల ధరల పతనం వాస్తవమే..