
ఈకేవైసీకి గడువు పెంపు
పార్వతీపురం: ఈకేవైసీ గడువు మళ్లీ పొడిగించారు. దీంతో పేదలకు టెన్షన్ తీరింది. ఏప్రిల్ 30వరకు ఈకేవైసీకి గడువు విధించడంతో రానున్న నెలల్లో రేషన్ నిలిచిపోతుందని పలువురు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈకేవైసీ చేయించుకునేందుకు జూన్ 30వరకు గడువును పొడిగించింది. దీంతో కార్డుదారులు కొంతమేర ఊపిరిపీల్చుకున్నారు. ఇంతవరకు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 38వేలమంది వరకు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
రేషన్ పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట
రేషన్ పంపిణీలో అక్రమాల కారణంగా చౌకదుకాణాల్లో బియ్యం పక్కదారి పట్టి దుర్వినియోగం కాకుండా చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుల్లోని సభ్యులంతా ఈకేవైసీ చేయించుకుని అర్హులైన వారికి మాత్రమే సబ్సిడీ బియ్యం అందేలా చర్యలు చేపడుతున్న తరుణంలో రేషన్‌కార్డులో లబ్ధిదారులంతా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని 15 మండలాల్లో 2,77, 153 రేషన్ కార్డులుండగా అందులో 8,23,638 మంది సభ్యులున్నారు. ఇంతవరకు 7.80లక్షమందివరకు ఈకే వైసీ చేయించుకోగా మిగిలినవారు చేయించుకోవాల్సి ఉంది. ఈకేవైసీ చేయించుకునేందుకు ఇంతవరకు రెండుసార్లు గడువును విధించి పొడిగిస్తున్నారు. తాజాగా జూన్ 30వరకు గడువు విధించారు.
ఇతర ప్రాంతాల్లో స్థిరపడడం వల్ల
బతుకు తెరువుకోసం యువకులు, వ్యవసాయ కూలీలు హైదరాబాద్, విశాఖపట్నం, చైన్నె, బెంగుళూరు తదితర ప్రాంతాలకు వలసవెళ్లారు. పండగలు, శుభకార్యాలకు, సొంత గ్రామాలకు వచ్చి తమ రేషన్ కార్డులో పేర్లను కొనసాగిస్తుంటారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు దూరం అవకూడదనే ఉద్దేశంతో రేషన్‌కార్డులను వినియోగిస్తూ ఆయాప్రాంతాల్లో రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. విద్యాభ్యాసం కోసం ఇతర పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థుల విషయంలోను, వృద్ధులకు వేలిముద్రలు పడని కారణంగా ఈకేవైసీ సమస్య తలెత్తుతోందని పలువురు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే సంక్షేమ పథకాలు దూరమవుతామని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు కూడా ఈకేవైసీ చేయించాలని ఆదేశించడంతో వారి వేలిముద్రలు పడకపోవడంతో ఆధార్‌కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
జూన్ 30వరకు సమయం
లబ్ధిదారులకు తీరిన టెన్షన్
జూన్ నెలాఖరు లోగా చేయించుకోవాలి
రేషన్ కార్డుల్లో కుటుంబసభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకునేందుకు జూన్ నెలాఖరువరకు గడువును పొడిగించారు. ఇంకా చేయించుకోని లబ్ధిదారులందరికీ ఈకేవైసీ చేసేలా సిబ్బందిని ఆదేశించాం. లబ్ధిదారులంతా సమీపంలోని చౌక దుకాణాలు, మీసేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయిచుకోవాలి.
ఐ.రాజేశ్వరి, పౌరసరఫరాల సంస్థ జిల్లా
మేనేజర్, పార్వతీపురం మన్యం జిల్లా