
పంటల సాగుకు ముందస్తు ప్రణాళికలు అవసరం
గరుగుబిల్లి: ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందస్తు ప్రణాళికలు అవసరమని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన తోటపల్లిలోని జట్టు ట్రస్టు ప్రాంగణంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలకు చెందిన ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలకు ఖరీఫ్ పంటలప్రణాళిక తయారీ, నవధాన్యాల సాగు తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుతుపవనాలు రావడానికి నెల రోజుల ముందు నవధాన్యాలు సాగుచేసుకోవాలని సూచించారు. ప్రధాన పంటను సాగుచేయడానికి ముందు నవధాన్యాలు సాగుచేసుకుంటే భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెప్పారు. నవధాన్యాల కిట్లు రైతు సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. డీపీఎం షణ్ముఖరాజు మాట్లాడుతూ భూములకు భూపరీక్షలను చేయించుకుంటే పోషకాల లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రీజినల్ టెక్నికల్ అధికారి జి.హేమసుందర్ మాట్లాడుతూ ఏడాదంతా భూమిపై పంటలు పండించేలా ప్రణాళిక చేసుకుంటే బహుళ ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. సమావేశంలో మండల వ్యవసాయాధికారి విజయభారతి, జట్టు డైరెక్టర్ ప్రహరాజ్, రైతు సాధికార సంస్థ ప్రతినిధి బి.భాను తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్