● గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్
విజయనగరం అర్బన్: ఉన్నత విద్యలో రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసన్ అన్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో ‘మాలిక్యుయల్స్ టు మెటీరియల్స్’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒక రోజు సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణ, విద్యానైపుణ్యాన్ని పెంపొందించడంలో యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. మెటీరియల్ సైన్స్‌పైనే ప్రపంచం ఆధార పడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీలతో కలిసి ప్రపంచాన్ని శాసించే విధంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ చీఫ్ ఎడిటర్, బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన ప్రొఫెసర్ ఎస్.నటరాజన్, ప్రొఫెసర్ బాలాజీ ఆర్ జాగీర్దార్, ప్రొఫెసర్ కేఆర్‌ప్రసాద్ మాట్లాడుతూ అధునాతన పద్ధతులలో తయారు చేసిన వివిధ పదార్థాలపై పరిశోధనాత్మక అంశాలను వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ముక్కామల శరత్‌చంద్రబాబు, కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ పడాల కిషోర్ నిర్వహణలో జరిగిన సదస్సులో యూనివర్సిటీ అధ్యాపకులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.