
పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు
విజయనగరం అర్బన్:
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలపై బుధవారం సమీక్షించారు. ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యే 23,765 మంది విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విడతకు 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2,248 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి తేదని, ఇన్విజిలేటర్లు సైతం సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పర్యాటకాభివృద్ధికి ముందుకు రావాలి
జిల్లా పర్యాటకాభివృద్ధిలో భాగంగా పీపీ మోడల్‌లో పెట్టుబడి పెటేందుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు మంజూరుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఆయా రంగాల్లో పెట్టుబడికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు.
గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద ఎకో టూరిజం అభివృద్ధికి రూ.రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సమావేశంలో జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి కుమారస్వామి, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.