
కీచక ఉపాధ్యాయుడు!
● బాలికపై లైంగిక వేధింపులు
● ప్రశ్నించిన ఉపాధ్యాయులకు బెదిరింపు
● పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారణ జరిపిన డీఎస్పీ
బొబ్బిలి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారారు. పదో తరగ తి చదువుతున్న బాలికపై కన్నేశారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులు, విద్యార్థులను యాసిడ్ పోస్తా, లారీతో గుద్ది చంపేస్తా అంటూ బొబ్బిలి పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బెదిరింపులకు దిగారు. విషయం పోలీసులకు తెలియడంతో బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు బుధవారం నేరుగా పాఠశాలకు వెళ్లారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులతో కలిసి మాట్లాడారు. అనంతరం ఓ తరగతి గదిలో ఉపాధ్యాయులతో పాటు 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు కౌన్సెలింగ్ చేశారు. పాఠశాలకు ఈ సమయంలో ఆకస్మికంగా ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు.. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలూ మాకు తెలుసు.. సమాచారం మేరకే వచ్చాం.. చెడ్డపని చేసిన వారు ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నట్టు గుర్తించాం.. అటువంటి వారు పరివర్తన చెందితే మంచిది.. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. మీకు ఏదైనా సమస్య వస్తే భయపడకుండా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని, దీనికోసం ఫోన్ నంబర్, పాఠశాలలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ఏఏ సందర్భాల్లో మోసపోతామో వివరించారు. సమస్యనుంచి గట్టెక్కే మార్గాలను సూ చించారు. దీనికోసం వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలను ఉదాహరణలుగా తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సమస్యను గుర్తించి వచ్చామని, ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. ఉపాధ్యాయుడికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ఆయన వెంట సీఐ కె.సతీష్‌కుమార్, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.