
పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న పైడితల్లి అమ్మవారు
విజయనగరం: విశాఖపట్నంలో జరిగే జీ–2 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మంగళవారం ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
చీఫ్‌కోచ్‌పై సస్పెన్షన్ వేటు
● ఇన్‌చార్జి బాధ్యతలు సత్యగోపాల్‌కు అప్పగింత
విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ చీఫ్‌కోచ్, స్విమ్మింగ్‌కోచ్ పి.అప్పలనాయుడును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ లోపాలపై సరైన సమాధానం ఇవ్వకపోవడం, అధికారులను తప్పు దోవ పట్టించే సమాచారం ఇచ్చినందుకు చర్యలు తీసుకున్నారు. మూడురోజుల్లో స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ నింపమని చెప్పిన ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించడంపై చర్యలు తీసుకున్నట్టు శాప్ అధికారులు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఇటీవల ఉద్యోగంలో చేరిన టెన్నిస్ కోచ్ సత్యగోపాల్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదేవత పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు జరిపారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, మూలా పాపారావు, దూసి శివప్రసాద్, రాజేష్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ సూపర్‌వైజర్ ఏడుకొండలు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఉపాధి కోర్సుల్లో మహిళలకు ఉచిత శిక్షణ
● వచ్చేనెల 8వ తేదీలోగా దరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: వివిధ ఉపాధిహామీ కోర్సుల్లో మహిళలకు స్థానిక మహిళా ప్రాంగణంలో ఉచిత శిక్షణ ఇస్తామని స్టేట్‌బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ జి.బి.వి.రమణ తెలిపారు. మహిళలకు టైలరింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, ఎంబ్రాయిడరీ అండ్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణపొందేవారికి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలుపుకార్డు కలిగి, పదోతరగతి పాస్/ఫెయిలైన 45 ఏళ్లలోపు గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 8వ తేదీలోగా దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని కోరారు. పూర్తివివరాల కోసం సెల్: 99595 21662, 99857 87820 నంబర్లను సంప్రదించాలన్నారు.