
కలాసీ స్వామినాయుడు (ఫైల్)
కొత్తవలస: అరకు–విశాఖ అంతర్ రాష్ట్ర రహదారిలో అడ్డూరివానిపాలెం గ్రామం సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మండలంలోని వీరభద్రపురం గ్రామానికి చెందిన కలాసీ గండ్రేడ స్వామినాయుడు (45)అక్కడికి అక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. అడ్డూరివానిపాలెం గ్రామం సమీపంలో గల గొడౌన్‌కు లారీలో వచ్చిన సిమెంట్‌ను దించేందుకు కలాసీలు వచ్చారు. లారీని రోడ్డు పక్కన ఆపి గొడౌన్ వద్ద సిమెంట్‌ను దించేందుకు ఏర్పాట్లు చేసుకునే క్రమంలో కలాసీ స్వామినాయుడితో పాటు లారీ డ్రైవర్ రోడ్డు పక్కన నిలబడ్డారు,. అంతలో విశాఖపట్నం నుంచి ఎస్.కోట వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మితిమీరిన వేగంతో వచ్చి కలాసీ స్వామినాయుడు, లారీ డ్రైవర్‌ను బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో కలాసీ స్వామినాయుడు అక్కడికక్కడే మృతి చెందగా లారీడ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు 108 వాహనంలో తోటి కలాసీలు తరలించారు. మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు.
అగ్ని ప్రమాదానికి గురై వృద్ధురాలు..
పాలకొండ రూరల్: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న చౌదరి సత్యవతి(62) తన ఇంటి సమీపంలో గల గడ్డివాముకు నిప్పు అంటుకోవటంతో ప్రమాదవశాస్తు అందులో చిక్కుని తీవ్రంగా గాయపడింది, దీంతో బాధితురాలిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది.
చికిత్స పొందుతూ వ్యక్తి..
బొండపల్లి: అజాగ్రత్తగా కారు నడుపుతూ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకోనడంతో బొండపల్లి మండలంలోని ముద్దూరు జంక్షన్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు, వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని అరిలోవకు చెందిన చవన్ శ్రీను(34) ద్విచక్ర వాహనంపై సోమవారం సాయంత్రం విజయనగరం నుంచి గజపతినగరం వస్తుండగా, గజపతినగరం నుంచి విజయనగరం వెళుతున్న కారు ముద్దూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహన చోదకుడిని ఢీకొట్టింది. దీంతో చవన్ శ్రీను తలకు తీవ్ర గాయాలవడంతో విజయనగరంలోని కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహచ్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.