
వివరాలు వెల్లడిస్తున్న వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు (వెనుక ముసుగులో నిందితులు)
విజయనగరం క్రైమ్: ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని డార్మిటరీలో గల లాకర్‌లో దాచుకున్న నగదును దొంగిలించిన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు మంగళవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ప్లైవుడ్ వ్యాపారి కె.చిట్టిబాబు ఈ నెల 3న వ్యాపారం నిమిత్తం జిల్లాకు వచ్చి, ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఉన్న డార్మిటరీలో క్యాష్ బ్యాగ్ పెట్టుకున్నాడు. ఈ నెల 8న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లాకర్‌లో వ్యాపారి పెట్టిన రూ.95వేలు నగదుతో కూడిన బ్యాగ్‌ను దొంగలించారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు విచారణ ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో పట్టణానికి చెందిన బిపి.కుమార్, పెందుర్తికి చెందిన జి.శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.90 వేల నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సైలు అశోక్‌కుమార్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ ఎస్సై విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి..
ట్రాఫిక్ ఎస్సై హరిబాబునాయుడు విధులకు ఆటంకం కలిగించి, దౌర్జన్యం చేసిన లంకాపట్నానికి చెందిన సోము శంకరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. శంకరరావు స్నేహితుడు రమేష్ మద్యం మత్తులో ఆటో నడుపుతూ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. ఆ సమయంలో విది నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై బి.హరిబాబునాయుడిని నిందితుడు సోమశంకర్ అడ్డగించి దౌర్జన్యం చేసి, చంపుతానని బెదిరించాడు. ఈ మేరకు ఎస్సై ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి శంకరరావును అరెస్టు చేసినట్లు సీఐ ప్రకటనలో వివరించారు.