
104 వాహనాలను ప్రారంభిస్తున్న విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
● రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యన్నారాయణ ● 104 వాహనాల ప్రారంభం
చీపురుపల్లి రూరల్ (గరివిడి): ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యం కల్పిస్తోందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు జిల్లాకు కేటాయించిన పందొమ్మిది 104 వాహనాలను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో కలిసి గరివిడిలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సంపూర్ణంగా ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ వాహనాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల చెంతకు వైద్య సేవలు అందించడం కోసం ఈ 104 వాహనాలను ప్రారంభించామని చెప్పారు. దివంగతనేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి ఈ వాహనాలతో ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతున్నాయన్నారు. జిల్లాలో ఇది వరకే 104 వాహనాలు ఉన్నప్పటికీ మరింత మెరుగైన వైద్యసేవలను అందించడం కోసం కొత్త వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఈ వాహనాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనునిత్యం పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతోనే పేదల పక్షాన నిలబడుతోందన్నారు. అందులో భాగంగానే ప్రతి సచివాలయం పరిధిలో స్థానికంగా గ్రామాల్లోనే వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో వెల్‌నెస్ సెంటర్‌లను కూడా మంజూరు చేశామన్నారు. ఈ భవన నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంతో వైద్యసేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ఎస్వీ.రమణకుమారి, చీపురుపల్లి,గరివిడి ఎంపీపీలు ఇప్పిలి వెంకటనరసమ్మ, మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీలు వాకాడ శ్రీనివాసరావు, వలిరెడ్డి శిరీష, మేజర్ పంచాయతీ సర్పంచ్ పి.ప్రమీల, వైఎస్సార్‌సీపీ గరివిడి మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కొణిశ కృష్ణంనాయుడు, బమ్మిడి అప్పలస్వామి, చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మెరకముడిదాం మండల నాయకులు తాడ్డివేణు, కోట్ల వెంకటరావు, అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.