
పూసపాటిరేగ : తాబేళ్లు మత్స్య సంపద అభివృద్ధికి దోహదం చేస్తాయని జిల్లా ఫారెస్టు రేంజ్ అధికారి ఎస్.వెంకటేష్ అన్నారు. మండలంలోని తిప్పలవలస తీరంలో ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ అధ్వర్యంలో 256 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి ఆదివారం ఆయన విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాబేళ్లు మత్స్యసంపద వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఈ ఏడాది 22,576 తాబేళ్లు గుడ్లును సేకరించడం జరిగిందని చెప్పారు. తీరంలో 10 హేచరీస్ ద్వారా తాబేళ్లు గుడ్లు ద్వార్లా పిల్లలను ఉత్పిత్తి చేసి సముద్రంలోకి విడిచిపెడుతున్నామని తెలిపారు. సముద్ర తాబేళ్లు సంరక్షణ వల్ల వాతావరణం సమతుల్యం చెంది మత్స్య సంపద పెరుగుతుందని పేర్కొన్నారు. సముద్ర తాబేళ్లను పర్యావరణ నేస్తాలుగా చెప్పొచ్చన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా డీఎఫ్‌ఓ ప్రసన్న, ఫారెస్టు సెక్షన్ అధికారి పి.అప్పలరాజు, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ బి.కామయ్య తదితరులు పాల్గొన్నారు.