
నెల్లిమర్ల రూరల్: బెంగళూరు వేదికగా ఈ నెల 24 నుంచి 29 వరకు జరుగుతున్న 4వ ఖేలో ఇండియా యూత్, జూనియర్, సీనియర్ జాతీయ ర్యాంకింగ్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శనపతి పల్లవి(జూనియర్–64కేజీల విభాగం) బంగారు పతకాన్ని సొంతం చేసుకోగా, సీనియర్ విభాగంలో వెండి పతకాన్ని సాధించింది. నెల్లిమర్ల పట్టణానికి చెందిన బి చంద్రిక(సీనియర్–55 కేజీల విభాగంలో) వెండి పతకం దక్కించుకుంది. జాతీయస్థాయి వేదికపై సత్తా చాటిన క్రీడాకారులను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు బీఎస్‌ఆర్ మూర్తి, లక్ష్మి, కోచ్ చల్లా రాము తదితరులు అభినందనలు తెలిపారు.