
కాలువలో ఉన్న పసికందు మృతదేహం
విజయనగరం క్రైమ్: స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఉన్న పెద్ద కాలువలో ఆదివారం ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు సమాచారమందించారు. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కాలువలో ఉన్న పసికందు మృతదేహాన్ని బయటకు తీయించి, జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కరరావు తెలిపారు.
ఇద్దరికి రిమాండ్
జామి: జామి గ్రామానికి చెందిన పి.ప్రసాద్, పి.మహలక్ష్మిలకు ఎస్.కోట న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ వెంకటరమణ విధులకు ఆటంకం కలిగించినట్లు ప్రసాద్, మహాలక్ష్మిలపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమండ్ విధించినట్లు ఎస్సై చెప్పారు.
తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
రాజాం సిటీ: స్థానిక శ్రీకాకుళం రోడ్డులో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని ఆదివారం అరెస్టు చేశామని సీఐ కె.రవికుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడిచేసి పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 1,03,950లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ఆటో, బైక్ ఢీ: యువకుడి మృతి
గుర్ల: మండలంలోని కెల్ల రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెల్ల గ్రామానికి చెందిన తుపాకుల సాయి (15) మృతి చెందాడు. తుపాకుల సాయి కెల్ల నుంచి ద్విచక్ర వాహనంపై గుర్ల వస్తుండగా రెల్లిపేట వద్ద ఆటో ఢీకొట్టడంతో రోడుపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. కెల్ల హైస్కూల్‌లో సాయి పదవ తరగతి చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్‌ఐ శిరీష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
నరసన్నపేట: నరసన్నపేట గాంధీనగర్‌కు చెందిన కరుకోల లక్ష్మి(48) అనే వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అద్దెకు ఉంటున్న ఇంటిలో నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నారు. భర్త నారాయణ మూర్తి వేధింపులకు తాళలేక ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మి, నారాయణమూర్తిలకు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా ఉద్యోగాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇంట్లో దంపతులిద్దరూ నివాసముంటున్నారు. నారాయణమూర్తి లక్ష్మిని వేధింపులకు గురి చేసేవాడని, నిత్యం కొట్టేవాడని లక్ష్మి సోదరి ఆదెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను బయటకు వెళ్లినప్పుడల్లా ఇంటికి రెండు వైపులా తాళాలు వేసి వెళ్తారని, శనివారం ఉదయం కూడా ఆయన బయటకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లారని, సాయంత్రం తిరిగి వచ్చే సరికి లక్ష్మి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని తమకు చెప్పడంతో వచ్చి చూశామని ఆదెమ్మ తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆదెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట ఎస్‌ఐ వై. సింహాచలం ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతురాలు లక్ష్మి (ఫైల్)