592 మార్కులతో దేవిక టాపర్
పెదగంట్యాడ: పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ పాఠశాల నుంచి మొత్తం 354 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 269 మంది ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ఇమంది దేవిక 592 మార్కులు, పి.పల్లవి 588, ఎ.లోకేష్ 587 మార్కులతో టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు మరో 65 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి సత్తా చాటారు. విద్యార్థుల విజయానికి గుర్తింపుగా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గురువారం పెదగంట్యాడలో పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు తాము సాధించిన మార్కుల ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా సాగింది.


