పుట్టెడు కష్టంలోనూ పట్టు వీడక.. | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు కష్టంలోనూ పట్టు వీడక..

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

542 మార్కులతో సత్తా చాటిన విద్యార్థిని

గాజువాక: పుట్టెడు కష్టాల్లోనూ ఆమె తన పట్టుదలను వదల్లేదు. ఒక పక్క తండ్రి మరణం తీవ్రంగా కుంగదీస్తున్నా.. గుండె నిండా దుఃఖాన్ని దిగమింగుకొని 10వ తరగతి పరీక్షలకు హాజరై, అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. శ్రీనగర్‌లోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో చదివిన అనుపమ, మార్చి 15న తన తండ్రి రామకృష్ణతో కలిసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవడానికి సింహాచలం బయలుదేరింది. సరిగ్గా పదో తరగతి పరీక్షలు ప్రారంభానికి ముందు రోజే ఈ ప్రయాణం సాగింది. అయితే, దురదృష్టవశాత్తూ బీహెచ్‌పీవీ జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ దుర్మరణం పాలయ్యారు. కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయినప్పటికీ, తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలన్న సంకల్పంతో అనుపమ గాజువాక హైస్కూల్‌ కేంద్రంలో పరీక్షలకు హాజరైంది. గురువారం విడుదలైన ఫలితాల్లో అనుపమ 542 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. ‘నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం ఆపవద్దని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. అందుకే ఎంత దుఃఖంలో ఉన్నా పరీక్షలు రాశాను’ అని భావోద్వేగానికి లోనైంది. భవిష్యత్తులో ఐఏఎస్‌ అధికారి కావాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొంది. తన కుమార్తె సాధించిన విజయంపై తల్లి రాజ్యలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement