స్టేట్ టాపర్ జ్ఞానేశ్వరి
ఆరిలోవ/గోపాలపట్నం: కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. దీనికి నిదర్శనం కొత్తపల్లి జ్ఞానేశ్వరి. పదో తరగతి ఫలితాల్లో 600లో 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది. శ్రీచైతన్య శాంతినగర్ బ్రాంచ్‌లో చదువుతున్న జ్ఞానేశ్వరి తన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ఇంకా బాగా చదివి భవిష్యత్‌లో ఎంబీబీఎస్ డాక్టర్ అవుతా. ప్రజలకు మంచి వైద్యం అందించాలనేది నా లక్ష్యం’ అని తెలిపింది. ‘ప్రతి రోజు క్లాసులపై పూర్తిగా దృష్టి పెట్టేదాన్ని. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత తప్పనిసరిగా రివిజన్ చేసేదాన్ని. సమయపాలన, క్రమశిక్షణతో చదవడం నాకు ఎంతో సహాయపడింది’ అని చెప్పింది. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమని తెలిపింది. తండ్రి శ్రీనివాసరావు రాంబిల్లి మండలం దిమిలిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి భారతి నావెల్ డాక్‌యార్డులో ఉద్యోగిగా ఉన్నారు. తమ కుమార్తె సాధించిన ఈ విజయంపై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


