ఉక్కుపాదం!
146 మందికి వార్నింగ్ నోటీసులు
12న జరిగిన సమ్మెలో ఎందుకు పాల్గొన్నారో వివరణ కోరుతూ
నోటీసుల జారీ
కొత్త లేబర్ కోడ్‌లను ఆధారంగా చూపిస్తూ చర్యలకు దిగిన
ఉక్కు యాజమాన్యం
హెచ్చరికలతో భయపడేది లేదని
స్పష్టం చేస్తున్న కార్మిక సంఘాలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ను గాడిలో పెట్టే చర్యలపై దృష్టి సారించాల్సిన యాజమాన్యం.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న కార్మికులపై కఠిన వైఖరి అవలంబించడం చర్చనీయాంశమైంది. ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడినప్పటి నుంచి కొనసాగుతున్న ఉద్యమాల నేపథ్యంలో.. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నందుకు 146 మంది కార్మిక నాయకులు, ఉద్యోగులకు వార్నింగ్ నోటీసులు జారీ చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న లేబర్ కోడ్‌లను ఆధారంగా చూపిస్తూ స్టీల్ యాజమాన్యం ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రైవేటీకరణ తర్వాత ఉధృతమైన ఉద్యమం
కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకోవాలనే లక్ష్యంతో అన్ని కార్మిక సంఘాలు నిరంతర పోరాటం సాగిస్తున్నాయి. గతంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఉద్యోగి–కార్మిక సంఘాలు రోడ్లపై నిరసనలు తెలపడం వంటి చర్యలతో ఉద్యమం ఉధృతమైంది. ప్రస్తుతం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది.
సమ్మెలో పాల్గొన్నందుకే నోటీసులా?
వీఆర్‌ఎస్, హెచ్‌ఆర్‌ఏ, జీతాలు, విద్యుత్ చార్జీలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలు తరచూ ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నెల 12న దేశవ్యాప్తంగా నిర్వహించిన సమ్మెకు మద్దతుగా ఉద్యోగులు నిరసనల్లో పాల్గొన్నారు. లేబర్ కమిషన్ వద్ద చర్చలు జరుగుతున్న సమయంలో సమ్మెలో పాల్గొనడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌లను ఆధారంగా చూపుతూ ఈ చర్యలు చేపట్టడం వివాదాస్పదమైంది.
‘సమ్మె రాజ్యాంగబద్ధ హక్కు’
సమ్మె చేయడం రాజ్యాంగబద్ధ హక్కు అని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం నిరసనలో పాల్గొన్నారనే కారణంతో హెచ్చరికలు జారీ చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణిస్తున్నాయి. కొత్త లేబర్ కోడ్‌ల అమలు పేరుతో కార్మిక హక్కులను పరిమితం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి.
ఉద్యమం మరింత ఉధృతమవుతుందా?
ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో, యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం కార్మిక వర్గాల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ‘‘హక్కుల కోసం పోరాడితే శిక్షలా?’’ అంటూ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ని నోటీసులు వచ్చినా విశాఖ ఉక్కును కాపాడుకునే పోరాటం నుంచి వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ప్లాంట్‌ను ఎటు తీసుకెళ్తున్నారు
సీ్టల్‌ప్లాంట్ యాజమాన్యం ప్లాంట్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందా, లేక కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తూ వెనక్కి నెడుతుందా అన్న సందేహం కలుగుతోంది. జారీ చేసిన వార్నింగ్ లెటర్లను వెంటనే ఉపసంహరించుకోవాలి. – డి.ఆదినారాయణ,
ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ
అలా అయితే సమ్మె ఉండేది కాదు
రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సి) ఉత్పత్తి ఆధారిత వేతనాలు చెల్లవని మూడుసార్లు ఆదేశించినా యాజమాన్యం అమలు చేయలేదు. ఇప్పుడు ఆర్‌ఎల్‌సి వద్ద చర్చలు జరుగుతున్నాయని సమ్మెను చట్టవిరుద్ధమని పేర్కొనడం ఆశ్చర్యకరం. దేశంలోని ఇతర స్టీల్‌ప్లాంట్లలో లేని విధంగా ఇక్కడ నోటీసులు జారీ చేయడం సరైంది కాదు.
– జె.అయోధ్యరామ్,
ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూ
వింత పోకడలు అనుసరిస్తున్నారు..
విశాఖ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఇటీవల విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తరచూ కొత్త ఆదేశాలతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కార్మిక వర్గం ఆగ్రహానికి దారి తీస్తుంది. జారీ చేసిన వార్నింగ్ లెటర్లను వెంటనే రద్దు చేయాలి. – మంత్రి రాజశేఖర్,
జాతీయ కార్యదర్శి, ఐఎన్‌టీయూసీ
ఉక్కుపాదం!
ఉక్కుపాదం!
ఉక్కుపాదం!


