నేడు నగరానికి రాష్ట్రపతి
సాక్షి, విశాఖపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నానికి రానున్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ–2026కు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. సాయంత్రం నేవల్ బేస్‌లో జరిగే ప్రెసిడెన్షియల్ బ్యాంక్విట్‌లో పాల్గొని ఐఎఫ్‌ఆర్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇతర రాజకీయ ప్రతినిధులు, వివిధ దేశాల నౌకాదళాధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. 18వ తేదీ ఉదయం నేవల్ బేస్ యాంకరేజ్ ప్రాంతంలో రాష్ట్రపతి భారత నౌకాదళ శక్తిని సమీక్షిస్తారు. అధ్యక్ష వాహనంగా ఎంపికై న ఐఎన్‌ఎస్ సుమేధ నుంచి ఫ్లీట్ రివ్యూ నిర్వహించనున్నారు. విదేశీ యుద్ధనౌకలు, భారత నౌకలు, జలాంతర్గాములు, నేవల్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఫ్లైపాస్ట్ విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ఆమె ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.
19న సిటీ పరేడ్, ఐవోఎన్‌ఎస్ సదస్సు
19వ తేదీ సాయంత్రం బీచ్‌రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ నిర్వహించనున్నారు. త్రివిధ దళాలు, కోస్ట్‌గార్డ్, విదేశీ దళాల కవాతు, వైమానిక శక్తి ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. అదే రోజు సాముద్రిక ఆడిటోరియంలో జరిగే అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. 20న నోవాటెల్‌లో ఐఓఎన్‌ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్ సమావేశం జరగనుంది. సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్‌లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు.


