కళాభారతిలో ముగిసిన బహుభాషా నాటకోత్సవాలు
మద్దిలపాలెం: కళాభారతి ప్రాంగణంలో రసజ్ఞ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన 10వ బహుభాషా నాటకోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన ‘ధన్యోస్మి’, ‘ముళ్లతీగలు’ నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో డాక్టర్ వేమలి త్రినాథరావు, హేమా వెంకటేశ్వరిల దర్శకత్వంలో రసజ్ఞ సభ్యులు, పీవీఆర్ మూర్తి దర్శకత్వంలో నవరస థియేటర్ ఆర్ట్స్ కళాకారులు తమ నటనతో మెప్పించారు. నాటక ప్రదర్శనకు ముందు రాజేశ్వరి బృందం నిర్వహించిన జానపద, కోలాట నృత్యాలు అలరించాయి. ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు.


