మత్స్యకారుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మహారాణిపేట: బంగ్లాదేశ్ జైలులో మగ్గుతున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులను తక్షణం విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ నేత వాసుపల్లి జానకీరామ్ డిమాండ్ చేశారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 20న వేటకి వెళ్లి పొరపాటున సరిహద్దు దాటిన 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ బంధించిందని తెలిపారు. గతంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జైళ్లలో చిక్కుకున్న వారిని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విడిపించిందని, బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల విడుదల కోసం కనీసం లాయర్‌ను కూడా నియమించలేకపోయిందని విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జానకీరామ్ ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, మత్స్యకారుల క్షేమం కోసం తాను స్వయంగా అక్కడికి వెళ్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి మత్స్యకారుల విడుదలకు చర్యలు చేపట్టాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో చొరవ చూపాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో మత్స్యకారులు గుంటూ దానయ్య, అర్జీల్లా హరి, పుక్కల్లా ప్రకాష్ పాల్గొన్నారు.


